రైతుల ఆందోళనలో నేడు పాల్గొననున్న రాహుల్ గాంధీ

  • నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన 
  • ఢిల్లీలోని గవర్నర్ హౌస్ నుంచి కాంగ్రెస్ ర్యాలీ
  • ఐక్యత సందేశాన్ని వినిపించేందుకేనన్న కాంగ్రెస్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో రైతులు చేపట్టిన ఆందోళనలో నేడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ తరపున ఐక్యత సందేశాన్ని వినిపించేందుకు చేపట్టనున్న ర్యాలీలో రాహుల్ పాల్గొంటారు. ఢిల్లీలోని గవర్నర్ హౌస్ నుంచి ఈ ర్యాలీ ప్రారంభం కానుంది.

 నిన్న తమిళనాడులోని మధురైలో పర్యటించిన రాహుల్ గాంధీ జల్లికట్టు పోటీలను వీక్షించారు. పోటీల్లో పాల్గొన్న వారిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. తమిళ ప్రజల సంస్కృతిని కించపరిచేవాళ్లకు, తమిళులను, వారి భాషను, వారి ఘనతర వారసత్వాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించేవారికి సందేశం ఇవ్వడానికే తాను జల్లికట్టు కార్యక్రమంలో పాల్గొంటున్నానని తెలిపారు.

కాగా, నేడు కిసాన్ అధికార్ దివస్‌ను నిర్వహించాలంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రైతులకు మద్దతు పలకాలని, రైతులపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసన తెలపాలని కోరారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని సూచించారు.


More Telugu News