శశికళ వచ్చాక ఆమె చేతుల్లోకే అన్నాడీఎంకే: ఏఎంఎంకే నేత సరస్వతి 

  • శశికళ విడుదల కావడానికి ముందే రాష్ట్రంలో రాజకీయ వేడి
  • అన్నాడీఎంకేను కాపాడేది ఒక్క శశికళేనన్న సరస్వతి
  • 90 శాతం మంది పదవుల్లో ఉండడానికి కారణం  ఆమెనని వ్యాఖ్య
  • చేసిన మేలు మరిచి విమర్శిస్తున్నారని ఆవేదన
అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ త్వరలోనే జైలు నుంచి విడుదల కానున్నారు. ఆమె విడుదల కావడానికి ముందే తమిళనాడులో రాజకీయ వేడి రగులుకుంది. ఆమె వచ్చినా రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి మార్పులు జరగబోవని అన్నాడీఎంకే నేతలు ఇప్పటికే ప్రకటించారు. అయితే, తాజాగా అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి చేసిన వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి.

శశికళ జైలు నుంచి విడుదలయ్యాక అన్నాడీఎంకే ఆమె చేతుల్లోకే వెళుతుందని, ఆ పార్టీని కాపాడేది ఆమేనని సరస్వతి వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకే అంటే శశికళేనని చిన్న పిల్లలు కూడా చెబుతున్నారని నిన్న విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ప్రస్తుతం పార్టీలో ఉన్న వారిలో 90 శాతం మంది శశికళ దయతోనే పదవులు అనుభవిస్తున్నారని అన్నారు. ఆమె చేసిన మేలును మరిచి ఇప్పుడు విమర్శలకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి కావడానికి శశికళే కారణమని, ప్రస్తుత ముఖ్యమంత్రి పళనిస్వామి ఆ పదవిని చేపట్టడం వెనక తమ పార్టీ ప్రధాన కార్యదర్శి దినకరన్ ఉన్నారని చెప్పుకొచ్చారు. శశికళ జైలు నుంచి విడుదలై వచ్చాక అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు ఆమెకే మద్దతు పలుకుతారని సరస్వతి వివరించారు.


More Telugu News