ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు

  • భూముల రిజిస్ట్రేషన్ కోసం ధరణి పోర్టల్
  • సందేహాలు వ్యక్తం చేస్తున్న విపక్షాలు
  • కోర్టులో పిటిషన్లు దాఖలు
  • గతంలోనే స్టే ఇచ్చిన న్యాయస్థానం
  • తాజాగా జూన్ 21 వరకు స్టే పొడిగింపు
నూతన రెవెన్యూ విధానం అమలు చేస్తున్న తెలంగాణ సర్కారు రాష్ట్రంలో భూములు, ఆస్తుల నమోదు కోసం ధరణి పోర్టల్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ధరణి పోర్టల్ లో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ తీరుతెన్నులపై ప్రతిపక్షాలు మొదటి నుంచి సందేహాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. దీనిపై పలు పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. వ్యవసాయేతర ఆస్తుల నమోదు, రిజిస్ట్రేషన్లపై గతంలో హైకోర్టు స్టే ఇచ్చింది.

తాజాగా 7 ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు కాగా, వాటిలో ఐదింటిని తిరస్కరించిన హైకోర్టు, మిగిలిన రెండింటిపై ఇవాళ విచారణ చేపట్టింది. ఒకే అంశంపై ఇన్ని పిటిషన్లు అవసరంలేదని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ అభిప్రాయపడ్డారు. వాదనల అనంతరం గతంలో ఇచ్చిన స్టేను జూన్ 21 వరకు పొడిగిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

వాదనల సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ కోర్టుకు తమ అభిప్రాయాలు వెల్లడించారు. ధరణిపై వ్యక్తమైన అభ్యంతరాలను కేబినెట్ సబ్ కమిటీ పరిశీలిస్తోందని, సర్కారు అభిప్రాయాలు తెలిపేందుకు కొంత సమయం కావాలని కోర్టుకు విన్నవించారు. ఆయన విజ్ఞప్తి పట్ల హైకోర్టు ధర్మాసనం సానుకూలంగా స్పందించి, స్టే పొడిగిస్తున్నట్టు వెల్లడించింది.


More Telugu News