నాలుగేళ్లలో 30,573 తప్పుడు ప్రకటనలు చేసిన డొనాల్డ్ ట్రంప్: 'వాషింగ్టన్ పోస్ట్' ప్రత్యేక కథనం!

  • ప్రజలను మభ్య పెట్టేందుకు ట్రంప్ యత్నం
  • రోజుకు సగటున 21 అబద్ధాలు
  • నవంబర్ 2న 503 తప్పుడు ప్రకటనలు
టొనాల్డ్ ట్రంప్ అబద్ధాలు చెబుతున్నారు... ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు... ఇటువంటి ఆరోపణలు గత నాలుగేళ్లుగా ఎన్నో వింటూనే ఉన్నాము. నాలుగేళ్ల క్రితం అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్, పదవి దిగిపోయే సమయానికి 30,573 అబద్ధాలు చెప్పారట. ఆయన రోజుకు సగటున 21 తప్పుడు క్లయిమ్స్ చేశారని, వాటితో ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నించారని 'వాషింగ్టన్ పోస్ట్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

పత్రిక ఫ్యాక్ట్ చెక్కర్ టీమ్, ఆయన అన్ని ప్రకటనలనూ విశ్లేషించి ఈ విషయాన్ని పేర్కొంది. బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలి 100 రోజుల్లోనే ట్రంప్, 492 అనుమానిత ప్రకటనలు చేశారని, ఇక, గత సంవత్సరం జరిగిన ఎన్నికల రోజున... అంటే నవంబర్ 2న ఏకంగా 503 తప్పుదారి పట్టించే ప్రకటనలను చేశారని గుర్తించింది.

తొలి ఏడాది వ్యవధిలో రోజుకు ఆరు తప్పుడు ప్రకటనలు చేసిన ట్రంప్, క్రమంగా ఆ సంఖ్యను పెంచుకుంటూ వెళ్లారట. రెండో సంవత్సరంలో 16, మూడవ సంవత్సరంలో 22, నాలుగో సంవత్సరంలో రోజుకు 39 సార్లు అబద్ధాలు చెప్పారని 'వాషింగ్టన్ పోస్ట్' పేర్కొంది. తొలి 27 నెలల కాలంలో 10 వేల అబద్ధపు క్లయిములు చేసిన ఆయన, ఆపై 14 నెలల వ్యవధిలోనే 20 వేల తప్పుడు ప్రకటనలు, దాని తరువాత ఐదు నెలల్లోనే ఆ సంఖ్యను 30 వేలకు చేర్చుకున్నారని పేర్కొంది. ఇక, మొత్తం 50 లక్షల మాటలను తన ప్రకటనలకు ఆయన వినియోగించుకున్నారని కూడా పత్రిక పేర్కొంది.


More Telugu News