ఆస్కార్ బరిలో సూర్య చిత్రం 'సూరారై పొట్రు'

  • పలు విభాగాల్లో ఆస్కార్ కు పోటీపడుతున్న సూరారై పొట్రు
  • నేటి నుంచి ఆస్కార్ స్క్రీనింగ్ రూమ్ లో సూరారై పొట్రు ప్రదర్శనలు
  • తమ చిత్రం మెప్పిస్తుందంటున్న చిత్ర నిర్మాత
  • ఓటీటీలో విడుదలైన చిత్రాలకు కూడా ఆస్కార్ నామినేషన్
  • కరోనా నేపథ్యంలో నిబంధనల సడలింపు
ఎయిర్ డెక్కన్ అధినేత కెప్టెన్ గోపీనాథ్ జీవితకథతో సూర్య హీరోగా తెరకెక్కిన 'సూరారై పొట్రు' చిత్రం ఆస్కార్ అవార్డులో బరిలో నిలిచింది. ఆస్కార్ అవార్డుల జనరల్ కేటగిరీలో ఈ చిత్రం ఇతర సినిమాలతో పోటీపడనుంది. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ కథా రచయిత తదితర విభాగాల్లో సూర్య సినిమా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఆస్కార్ అవార్డుల స్క్రీనింగ్ రూమ్ లో 'సూరారై పొట్రు' చిత్రం ఇవాళ్టి నుంచి ప్రదర్శనకు అందుబాటులో ఉంటుంది.

దీనిపై చిత్ర సహనిర్మాత రాజశేఖర్ కర్పూర సుందరపాండ్యన్ స్పందిస్తూ, ఆస్కార్ జ్యూరీ సభ్యులను తమ చిత్రం మెప్పిస్తుందన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులను అలరించిందని అన్నారు.

కాగా, ఈసారి కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆస్కార్ నిబంధనలు సడలించారు. ఓటీటీ వేదికలపై విడుదలైన చిత్రాలను కూడా నామినేషన్లకు అనుమతించారు. సూర్య హీరోగా వచ్చిన ఈ 'సూరారై పొట్రు' చిత్రం కూడా ఓటీటీ ద్వారానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తెలుగులో 'ఆకాశం నీ హద్దురా' పేరిట ప్రదర్శితమైంది. ఈ సినిమాకు తెలుగమ్మాయి సుధా కొంగర దర్శకత్వం వహించగా, సూర్య సరసన అపర్ణ బాలమురళి నటించారు. జీవీ ప్రకాశ్ సంగీతం అందించారు.


More Telugu News