ఎస్ఐ రామారావు పదోన్నతి కేసు.. ప్రతిసారి డీజీపీని కోర్టుకు పిలవడం ఇబ్బందిగా ఉందన్న న్యాయస్థానం

  • మూడు నెలలు గడిచినా కోర్టు ఆదేశాలు బేఖాతరు
  • కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసిన రామారావు
  • కోర్టుకు హాజరైన డీజీపీ, ఐజీ, ఏలూరు డీఐజీ
ఎస్ఐ రామారావు పదోన్నతి కేసులో ఏపీ డీజీపీ గౌతం సవాంగ్, హోంశాఖ కార్యదర్శి, ఐజీ మహేశ్ చంద్ర లడ్డా, ఏలూరు డీఐజీ నేడు హైకోర్టుకు హాజరయ్యారు. విచారణ సందర్భంగా డీజీపీని ఉద్దేశించి న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.

డీజీపీని ప్రతిసారి ఇలా కోర్టుకు పిలవడం చాలా ఇబ్బందిగా ఉందని పేర్కొంది. గత విచారణ సందర్భంగా పదోన్నతి జాబితాలో ఎస్ఐ రామారావు పేరును చేర్చాలని పోలీసుశాఖను కోర్టు ఆదేశించింది. అయితే, రోజులు గడుస్తున్నా కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడంతో రామారావు మరోమారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

ఆయన దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం డీజీపీ గౌతం సవాంగ్, హోంశాఖ కార్యదర్శి, ఐజీ మహేశ్‌చంద్ర లడ్డా, ఏలూరు డీఐజీని కోర్టుకు హాజరు కావాలంటూ ఆదేశించింది. దీంతో వారు నేడు కోర్టుకు హాజరయ్యారు.

 మూడు నెలలు అయినా రామారావు పదోన్నతి విషయంలో కోర్టు ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. డీజీపీని ఇలా ప్రతిసారి కోర్టుకు పిలవడం చాలా ఇబ్బందిగా ఉందని న్యాయస్థానం ఆవేదన వ్యక్తం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే నెల 25వ తేదీకి వాయిదా వేసింది.


More Telugu News