తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి వైద్య కళాశాలల ప్రారంభం.. సర్కారు గ్రీన్ సిగ్నల్

  • రెడీ కావాలంటూ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ఆదేశించిన ప్రభుత్వం
  • ఈ నెల 29న గవర్నర్‌తో యూనివర్సిటీల కులపతుల భేటీ
  • విద్యార్థులను రెండు బ్యాచ్‌లుగా విభజించి క్లాసులు
కరోనా కారణంగా తెలంగాణలో గత 9 నెలలుగా మూతబడిన ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలను తిరిగి తెరిచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి కళాశాలలను పునఃప్రారంభించవచ్చంటూ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఇందు కోసం అవసరమైన చర్యలు చేపట్టాలని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ఆదేశించారు.

కళాశాలల ప్రారంభానికి ముందు ఈ నెల 29న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సమక్షంలో అన్ని యూనివర్సిటీల ఉపకులపతులు సమావేశం అవుతారు. అందులో తీసుకునే నిర్ణయాల ఆధారంగా అవసరమైన మార్పులు చేస్తారు. అలాగే, కాలేజీల ప్రారంభానికి ఒక రోజు ముందు ఈ నెల 31న ప్రభుత్వం, ప్రైవేటు వైద్య, నర్సింగ్ కళాశాలల ప్రధానాచార్యులతో ఆరోగ్య వర్సిటీ, వైద్య విద్య డైరెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు, అభిప్రాయాల ఆధారంగా కళాశాలల ప్రారంభానికి అవసరమైన చర్యలు తీసుకుంటారు.

కళాశాలలు ప్రారంభమైన తర్వాత విద్యార్థులను రెండు బ్యాచ్‌లుగా విభజిస్తారు. సగం బ్యాచ్‌కు తొలి 15 రోజులు, రెండో బ్యాచ్‌కు మిగతా 15 రోజులు క్లాసులు ఉంటాయి. మళ్లీ ఒక్కో బ్యాచ్‌ను రెండుగా విభజించి ఉదయం 9-12 గంటల మధ్య ఓ బ్యాచ్, 12-3 గంటల మధ్య మరో బ్యాచ్‌గా చేసి క్లాసులు చెబుతారు. మరో మూడు నాలుగు నెలల వరకు థియరీ తరగతులను ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు. వీటిని కూడా చెరో 15 రోజులుగా విభజించారు.


More Telugu News