ప్రియమైన జెన్నిఫర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు: 'ఆర్ఆర్ఆర్' హీరోయిన్ ఫ‌స్ట్‌లుక్ పోస్ట్ చేసిన‌ ఎన్టీఆర్

  • ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ హీరోయిన్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌
  • థ్యాంక్యు చెప్పిన ఒలీవియా మోరిస్
  • ఎన్టీఆర్ స‌ర‌స‌న జెన్నిఫ‌ర్‌గా ఒలీవియా
బాహుబ‌లి లాంటి సూప‌ర్ హిట్ సినిమా త‌ర్వాత దర్శక దిగ్గ‌జం రాజమౌళి రూపొందిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ మూవీ ఆర్ఆర్ఆర్ షూటింగ్‌కు సంబంధించి మ‌రో పోస్ట‌ర్ విడుద‌లైంది. ఈ రోజు హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆమె ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశారు. ఈ సినిమాలో  కొమరం భీమ్‌గా నటిస్తోన్న ఎన్టీఆర్ స‌ర‌స‌న ఒలీవియా మోరిస్ న‌టిస్తోంది. ఇందులో ఆమె బ్రిటిష్ యువ‌తిగా క‌న‌ప‌డ‌నుంది. 

ప్రియమైన జెన్నిఫర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు  అంటూ ఎన్టీఆర్ ఈ ఫ‌స్ట్‌లుక్‌ను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆయ‌న‌కు ఒలీవియా మోరిస్ థ్యాంక్యు చెప్పింది ప్ర‌స్తుతం ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ జ‌రుగుతోంది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తోన్న రామ్ చరణ్ కు సంబంధించిన టీజ‌ర్‌, కొమురం భీం పాత్ర‌లో న‌టిస్తోన్న ఎన్టీఆర్ టీజ‌ర్‌ను ఇప్ప‌టికే ఆ సినిమా యూనిట్ విడుద‌ల చేసింది.

సామాజిక మాధ్యమాల్లో వ‌రుస‌గా అప్‌డేట్లు ఇస్తూ సినిమాపై ఆసక్తిని పెంచేలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు రాజ‌మౌళి.  ఈ ఏడాది అక్టోబర్ 13వ తేదీన ఈ సినిమా విడుద‌ల కానున్న‌ట్లు ఇటీవ‌లే ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఈ సినిమా దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోంది.


More Telugu News