త‌న భ‌ర్త అదృశ్య‌మ‌య్యాడంటూ శిరోముండనం బాధితుడు ప్రసాద్ భార్య ఫిర్యాదు!

  • గ‌త ఏడాది ప్రసాద్‌కు పోలీసు స్టేషన్‌లో శిరోముండనం
  • ఇసుక రేవు వివాదంలో చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ్డ‌ ఎస్సై
  • వేధింపులు ఎదుర‌వుతున్నాయ‌ని ప్రసాద్ మ‌న‌స్తాపం 
  • రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన వైనం
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌త ఏడాది జులై 18న ఇండుగమల్లి ప్రసాద్ అనే వ్య‌క్తికి పోలీసు స్టేషన్‌లో అప్పటి ఎస్సై ఫిరోజ్‌ శిరోముండనం చేయించిన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. ప్ర‌సాద్‌ తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలి వాసి. కటావరం వద్ద ఇసుక రేవు వివాదంలో ఆరోప‌ణ‌లు చేస్తూ ఎస్సై అప్ప‌ట్లో ఈ చ‌ర్య‌కు  పాల్ప‌డ్డాడు. తాజాగా, ప్రసాద్‌ కనిపించడం లేదంటూ ఆయన భార్య కౌసల్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.  

రెండు రోజుల క్రితం ఆయ‌న ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేద‌ని తెలిపింది. ఈ  ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామ‌ని సీతానగరం పోలీసులు తెలిపారు. కాగా, తనకు శిరోముండనం చేయాల‌ని చెప్పిన వైసీపీ నాయకులను అరెస్టు చేయాలంటూ గ‌తంలో ప్ర‌సాద్ నిరసన దీక్షకు దిగాడు. అయిన‌ప్ప‌టికీ, ఈ కేసు ముందుకు సాగ‌లేదు.  

దీంతో  ఆయ‌న తీవ్ర మనస్తాపం చెందాడు. త‌న‌కు శిరోముండనం చేయ‌డం ప‌ట్ల కొంద‌రు మాటలతో వేధిస్తున్నారని ప్ర‌సాద్ త‌మ‌కు ప‌దే ప‌దే చెప్పేవాడ‌ని ఆయ‌న‌ కుటుంబ స‌భ్యులు అంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఇంటి నుంచి వెళ్లిపోయిన‌ట్లు చెప్పారు.  


More Telugu News