ఎస్ఈసీ అనుమతి లేకుండా అధికారులపై ఎవరూ చర్యలు తీసుకోలేరు: పెద్దిరెడ్డి వ్యాఖ్యలకు ఎన్నికల సంఘం కౌంటర్

  • ఏపీలో భగ్గుమంటున్న పంచాయతీ ఎన్నికల వ్యవహారం
  • అధికారులపై పెద్దిరెడ్డి వ్యాఖ్యలు
  • అలాంటి వ్యాఖ్యలు పట్టించుకోనవసరంలేదన్న ఎస్ఈసీ
  • ఎస్ఈసీని కలిసిన ఉద్యోగ సంఘాలు!
ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికల వ్యవహారం ఎస్ఈసీ, అధికార పక్షం మధ్య పోటీ అన్నట్టుగా తయారైంది. ఎస్ఈసీ మాట వినే అధికారులపై చర్యలు తప్పవని పంచాయతీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించడం తెలిసిందే. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది.

ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులపై ఎస్ఈసీ అనుమతి లేకుండా ఎవరూ చర్యలు తీసుకోలేరని స్పష్టం చేసింది. ఆ అధికారం ఎవరికీ లేదని తెలిపింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని తెలిపింది.

ఎన్నికల వేళ దౌర్జన్యపూరిత చర్యలకు పాల్పడేవాళ్లను ఉపేక్షించేది లేదని, బెదిరింపు ప్రకటనలు చేస్తున్నది ఎంత పెద్దవాళ్లయినా లక్ష్యపెట్టాల్సిన అవసరం లేదని ఎస్ఈసీ పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ కు అనుగుణంగా పనిచేసేవారికి భద్రత ఉంటుందని, ఆర్వోలు అభద్రతాభావానికి గురికావాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. ఎస్ఈసీ అనుమతి లేకుండా తీసుకునే చర్యలపై నిషేధిత ఉత్తర్వులు ఇస్తామని వెల్లడించారు. వ్యక్తులు తాత్కాలికమని, వ్యవస్థలు శాశ్వతమన్న అంశాన్ని గుర్తెరగాలని పేర్కొన్నారు.

ఎస్ఈసీని ఉద్యోగ సంఘాలు కలిసిన నేపథ్యంలో, ఉద్యోగ జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే ఎస్ఈసీ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.

దీనిపై బొప్పరాజు మాట్లాడుతూ, అధికారులను, ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేయవద్దని అటు ప్రభుత్వాన్ని, ఇటు ఎస్ఈసీని కోరుతున్నామని అన్నారు. ప్రస్తుతం తాము ఎన్నికల సంఘం అధీనంలో పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు.


More Telugu News