కరోనా వైరస్ పై డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన!

  • వూహాన్ ల్యాబ్ నుంచి లీక్ కాలేదు
  • జంతువుల నుంచే మనుషులకు వ్యాపించింది
  • ఏ జంతువో ఇంకా గుర్తించలేదన్న డబ్ల్యూహెచ్ఓ
గత సంవత్సరం ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్ నుంచి లీక్ కాలేదని, ఇది జంతువుల నుంచి మనుషులకు పాకిన వైరస్ మాత్రమేనని, అది ఏ జంతువన్న విషయాన్ని ఇంకా నిర్ధారించలేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు కీలక ప్రకటన చేశారు.

 చైనాలోని వూహాన్ సహా పలు ప్రాంతాల్లో పర్యటించిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ హెడ్ పీటర్ బెన్ ఎంబారెక్, స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ వైరస్ వూహాన్ ల్యాబ్ నుంచి బయట పడలేదని అన్నారు. వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయమై మరింత లోతుగా విచారించాల్సి వుందని ఆయన అన్నారు.

ఇక కరోనా వైరస్ మూలాలను కనుగొనేందుకు సౌత్ ఈస్ట్ ఆసియాపై దృష్టిని సారించామని ఆయన అన్నారు. తమ టీమ్ చైనాలో జరుపుతున్న విచారణ దాదాపుగా పూర్తయిందని పీటర్ బెన్ వెల్లడించారు. 2019లో హుబేయి ప్రావిన్స్ లోని వూహాన్ లో తొలిసారిగా కరోనా వైరస్ కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ 10.60 కోట్ల మందికి వ్యాధి సోకగా, 23 లక్షల మందికి పైగా కన్నుమూశారు.

ఈ వైరస్ మానవులకు సంక్రమించే ముందు జంతువుల్లో వ్యాపించిందని స్పష్టం చేసిన పీటర్ బెన్, ఇది సహజ సిద్ధంగానే కొన్ని రకాల వైరస్ ల రూపాంతరమేనని అన్నారు. ఇక తొలి కేసు నమోదు కావడానికి ముందు వూహాన్ లో వైరస్ ఉందనడానికి కూడా ఎటువంటి సంకేతాలనూ తాము గుర్తించలేదని అన్నారు.

కాగా, వూహాన్ లో వైరస్ ను గుర్తించే ముందే అది వేరే ప్రాంతాల్లో ఉండి ఉండవచ్చని చైనా హెల్త్ కమిషన్ ప్రతినిధి లియాంగ్ వాన్నియన్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక శీతలీకరించిన ఆహార పదార్థాల నుంచి వైరస్ వ్యాపించిందా? అన్న విషయాన్ని తేల్చేందుకు తదుపరి విచారణ కొనసాగనుందని అన్నారు.


More Telugu News