యూపీ ఉన్నావ్​ లో ఇద్దరు దళిత బాలికల అనుమానాస్పద మృతి.. మరో బాలిక పరిస్థితి విషమం

  • పశుగ్రాసం కోసం వెళ్లిన ముగ్గురు బాలికలు
  • అచేతన స్థితిలో ఉండడాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు
  • విష ప్రయోగం జరిగిందన్న వైద్యులు
  • హత్య చేశారని కుటుంబ సభ్యుల ఆరోపణ
ఉత్తర్ ప్రదేశ్ లోని ఉన్నావ్ లో మరో దారుణం జరిగింది. ఇద్దరు దళిత బాలికలు అనుమానాస్పద స్థితిలో మరణించారు. మరో బాలిక కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఘటనా స్థలంలో వారి కాళ్లూచేతులు కట్టిపడేసి ఉన్నాయని, అవి ముమ్మాటికీ హత్యలేనని వారి తరఫు బంధువులు, గ్రామస్థులు ఆరోపించారు.

ఆ ఘటనపై పోలీసులు చెబుతూ, విష ప్రయోగం జరిగిన ఆనవాళ్లున్నాయని తెలిపారు. పశు గ్రాసం కోసం ముగ్గురు బాలికలు సాయంత్రం 3 గంటల ప్రాంతంలో వారి పొలానికి వెళ్లారని ఉన్నావ్ ఎస్పీ ఆనంద్ కులకర్ణి తెలిపారు. అయితే, సాయంత్రమైనా వారు ఇంటికి తిరిగిరాకపోవడంతో, వెతుక్కుంటూ పొలానికి వెళ్లిన కుటుంబ సభ్యులకు  అచేతన స్థితిలో పడి ఉన్న అమ్మాయిలు కనిపించారన్నారు. వారి ఫిర్యాదు మేరకు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నామని, అప్పటికే వారిని ఆస్పత్రికి తీసుకెళ్లారని తెలిపారు.

అయితే, 13, 16 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలికలు అప్పటికే చనిపోయినట్టు వైద్యులు చెప్పారని, 17 ఏళ్ల వయసున్న మరో బాలికకు చికిత్స చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందన్నారు. దీంతో వెంటనే ఆమెను కాన్పూర్ రీజెన్సీ ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారని వివరించారు. అందరి వాదనలను పరిగణనలోకి తీసుకుని కేసును దర్యాప్తు చేస్తామని కులకర్ణి చెప్పారు. ప్రాథమిక ఆధారాలను బట్టి వారి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవన్నారు.

కుటుంబ సభ్యులు ఇవి ముమ్మాటికీ హత్యలేనని ఆరోపించారు. తాము ఘటనా స్థలానికి వెళ్లేసరికి ముగ్గురి కాళ్లూచేతులు కట్టిపడేసి ఉన్నాయని, పరిస్థితి విషమంగా ఉన్న అమ్మాయి మెడను చున్నీతోనూ బిగించారని గ్రామస్థులు చెబుతున్నారు. వారి నోటి వెంట నురగలు వచ్చాయన్నారు. అయితే, ఇప్పుడే ఆ విషయాన్ని నిర్ధారించలేమని లక్నో రేంజ్ ఐజీ లక్ష్మి సింగ్ తెలిపారు.  

కాగా, మూడో బాలికకు మెరుగైన చికిత్సను అందించాలని, వెంటనే ఢిల్లీ ఎయిమ్స్ కు ఆమెను తరలించాలని భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. దేశంలో నానాటికీ దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. ఇలాంటి అరాచకాలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.


More Telugu News