చమురు ధరలపై ఒపెక్​ దేశాలు మాట నిలబెట్టుకోవాలి: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​

  • డిమాండ్ కు అనుగుణంగా ఉత్పత్తిని పెంచాలన్న పెట్రోలియం మంత్రి
  • ధరలను బాధ్యతాయుతంగా నిర్ణయించాలని సూచన
  • ఈ ధరలు తమ లాంటి దేశాలకు అస్సలు కుదరదని స్పష్టీకరణ
  • ఒపెక్ దేశాలు ఏడాది నుంచి ఇప్పటిదాకా ఉత్పత్తిని పెంచలేదని కామెంట్
చమురు ఉత్పత్తిని పెంచి ధరలను స్థిరీకరిస్తామన్న మాటను ఒపెక్ దేశాలు (చమురు ఎగమతి చేసే దేశాల సమాఖ్య) నిలబెట్టుకోవాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కోరారు. ప్రపంచ దేశాల్లోని డిమాండ్ కు తగ్గట్టు ఉత్పత్తిని పెంచాలన్నారు. ఐహెచ్ఎస్ మార్కెట్ నిర్వహించిన సెరావీక్ సదస్సులో ఆయన మాట్లాడారు.

ప్రస్తుతం దేశంలో కరోనాకు ముందు నాటి పరిస్థితులు వచ్చాయని, పెట్రోల్, డీజిల్ వినియోగానికి డిమాండ్ పెరిగిందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బాధ్యతాయుతమైన ధరలైతేనే తమకు బాగుంటుందన్నారు. గత ఏడాది కరోనా నేపథ్యంలో ముడి చమురు ఉత్పత్తిని తగ్గిస్తామన్న ఒపెక్ దేశాల నిర్ణయాన్ని భారత్ గౌరవించిందని గుర్తు చేశారు.

2021 నాటికి మళ్లీ ప్రపంచ మార్కెట్లలో డిమాండ్ ను బట్టి చమురు ఉత్పత్తిని పెంచుతామంటూ ఆ టైంలో ఒపెక్ దేశాలు హామీ ఇచ్చాయన్నారు. కానీ, ఇప్పటికీ ఉత్పత్తి మళ్లీ మామూలు స్థాయికి చేరలేదని అన్నారు. ఇప్పుడున్న ధరలు తమ మిత్రదేశాలకు సరిపోతాయేమోగానీ.. అభివృద్ధి చెందుతున్న తమ లాంటి దేశాలకు మాత్రం అసలు కుదరదని అన్నారు.

ధరలు ఇలాగే పెరిగితే పర్యావరణ హిత ఇంధన వనరుల వాడకాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తామన్నారు. కాబట్టి ఒపెక్ దేశాలు ఇచ్చిన మాట ప్రకారం ఉత్పత్తిని పెంచి, ధరలను స్థిరీకరించాలని ప్రధాన్ కోరారు.


More Telugu News