జపాన్‌లో భారీ భూకంపం... సునామీ హెచ్చరికలు!

  • మియాగి ప్రాంతంలో కంపించిన భూమి
  • ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు
  • రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.0గా నమోదు
  • 2011లో ఇదే ప్రాంతంలో సునామీ
ఉత్తర జపాన్‌లో శనివారం భారీ భూకంపం సంభవించింది. మియాగి ప్రాంతంలో వచ్చిన భూప్రకంపనలతో అక్కడి భవనాలు ఊగిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రాజధాని టోక్యో నగరం సైతం ప్రకంపనల ప్రభావానికి లోనైంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో ఉన్న అణు రియాక్టర్లపైనా ఎలాంటి ప్రభావం పడలేదని పేర్కొన్నారు.

రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.0గా నమోదైంది. 54 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. ప్రకంపనలు భారీ స్థాయిలో ఉండడంతో అక్కడి ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. 2011లోనూ మియాగి ప్రాంతంలో భారీ భూకంపం సంభవించి సునామీ వచ్చింది. అప్పట్లో ఆ ప్రాంతం భారీ స్థాయిలో దెబ్బతింది.

ఈ నేపథ్యంలో జపాన్‌ మెటిరియోలాజికల్‌ ఏజెన్సీ ఇప్పుడు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేసింది. దాదాపు మీటరు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని అక్కడి ప్రజల్ని అప్రమత్తం చేసింది.  కానీ, 90 నిమిషాల తర్వాత హెచ్చరికల్ని తిరిగి వెనక్కి తీసుకుంది.


More Telugu News