సోష‌ల్ మీడియా సంస్థ‌లు బ్యాన్ చేసిన నేపథ్యంలో.. సొంత‌ సామాజిక మాధ్యమ‌ సంస్థను ప్రారంభిస్తున్న‌ ట్రంప్!

  • అమెరికాలో ఈ ఏడాది జనవరి 6న క్యాపిటల్‌ భవనంపై దాడి
  • దాంతో ట్రంప్ సోష‌ల్ మీడియా ఖాతాలు బ్యాన్
  • ఆయా ఖాతాల‌ను వినియోగించుకోలేక‌పోతోన్న ట్రంప్  
అమెరికాలో ఈ ఏడాది జనవరి 6న క్యాపిటల్‌ భవనంపై ఆ దేశ మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మద్దతుదారులు దాడికి పాల్ప‌డిన అనంత‌రం ట్రంప్ ట్విట్ట‌ర్‌, ఫేస్‌బుక్‌ సహా ఇతర ఖాతాల‌న్నింటినీ ఆయా సంస్థ‌లు బ్లాక్ చేసిన విష‌యం తెలిసిందే.  దీంతో ఆయా ఖాతాల‌ను వినియోగించుకోలేక‌పోతోన్న ట్రంప్ కొత్తగా తానే సోష‌ల్ మీడియా సంస్థ‌ను నెలకొల్పి, అందులో ఓ ఖాతాను ప్రారంభించాల‌ని భావిస్తున్నారు.  

మూడు నెల‌ల త‌ర్వాత ట్రంప్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా రీ ఎంట్రీ ఇస్తార‌ని ఆయ‌న‌ సీనియర్‌ సలహాదారు జేస‌న్ మిల్ల‌ర్ చెప్పారు. ట్రంప్ ప్రారంభించనున్న ఈ సోష‌ల్ మీడియా గ్రూపు చాలా భిన్నంగా ఉంటుంద‌ని ఆయ‌న వివ‌రించారు. అది సోష‌ల్ మీడియా చ‌రిత్ర‌నే మార్చేస్తుందని చెప్పుకొచ్చారు.

ట్రంప్ కొత్త సామాజిక మాధ్యమ వేదికను ప్రారంభించనున్నార‌ని జ‌రుగుతోన్న‌ ప్ర‌చారం ఆస‌క్తిని రేపుతోంది. అయితే, ఈ అంశానికి సంబంధించి ఇతర వివరాలేవీ తెలియ‌రాలేదు. కాగా, ట్రంప్ అప్ప‌ట్లో మీడియా కంటే సామాజిక మాధ్య‌మాలనే బాగా న‌మ్మేవారు. త‌న‌కు సంబంధించిన విష‌యాల‌న్నింటినీ ట్విట్ట‌ర్ ద్వారానే చెప్పేవారు. ఇప్పుడు ఆ మాధ్య‌మాలు కూడా దూరం కావ‌డంతో త‌న‌ను బ్యాన్ చేయ‌డానికి వీలు లేకుండా తానే కొత్త సంస్థ‌ను ప్రారంభిస్తున్నారు.


More Telugu News