ఆ టైంలో హోం మంత్రి ఆసుపత్రిలో ఉన్నారు: శరద్​ పవార్​

  • ‘అంబానీ’ కేసులో ముంబై మాజీ సీపీ ఆరోపణలపై కామెంట్స్
  • హోం మంత్రి రూ.100 కోట్ల టార్గెట్ పెట్టారన్న పరంబీర్ సింగ్
  • ఫిబ్రవరి 15 నుంచి 27 మధ్య ఐసోలేషన్ లో ఉన్నారన్న శరద్ పవార్
  • దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకే ఆరోపణలని విమర్శ
నెలనెలా రూ.100 కోట్ల వసూళ్లు చేసేలా సచిన్ వాజేకి మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ టార్గెట్ పెట్టారన్న ముంబై మాజీ పోలీస్ కమిషనర్ (సీపీ) పరంబీర్ సింగ్ ఆరోపణలపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో తీవ్రమైన రాజకీయ దుమారం రేగడంతో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఆ సమయంలో మంత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఫిబ్రవరి 5 నుంచి 15 మధ్య అనిల్ దేశ్ ముఖ్ ఆసుపత్రిలో ఉన్నారన్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 15 నుంచి 27 మధ్య నాగ్ పూర్ లోని ఆయన ఇంట్లో ఐసోలేషన్ లో ఉన్నారని చెప్పారు. ఆరోపణలపై దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. తుది నిర్ణయం ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేదేనని అన్నారు.

అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాలున్న కారును పెట్టిన కేసులో దర్యాప్తును తప్పుదోవ పట్టించడానికే అవినీతి మరకలు అంటిస్తున్నారని ఆరోపించారు. దర్యాప్తులో లోపాలున్నాయని, వాటి నుంచి తప్పించుకునేందుకు ఈ నాటకాలని అన్నారు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ చేసిన అరెస్టులతోనే హిరెన్ ను ఎవరు చంపించారో తేలిపోయిందన్నారు. ఎవరి కోసం ఆ ఇద్దరు హిరెన్ ను చంపేశారని ప్రశ్నించారు. ఏటీఎస్ పోలీసులు సరైన దిశలో దర్యాప్తు చేస్తున్నారని అన్నారు.


More Telugu News