కొత్త కుర్రాడు ప్ర‌సిద్ధ్ ఆట‌తీరుపై నాకెలాంటి ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌లేదు: కేఎల్ రాహుల్

  • అత‌డు బాగా ఆడ‌తాడ‌ని నాకు ముందే తెలుసు
  • తొలి మ్యాచులోనే అద‌ర‌గొట్టాడు
  • అరంగేట్ర మ్యాచులతోనే మ‌న క్రికెట‌ర్లు   రాణిస్తున్నారు
  • సూర్యకుమార్, ఇషాన్, కృనాల్ కూడా రాణించారు
ఇటీవ‌ల ఇంగ్లండ్‌తో జ‌రిగిన‌ తొలి వన్డేలో టీమిండియా విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఆ మ్యాచు ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన భార‌త‌ పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ తొలి మ్యాచ్‌లోనే అద్భుతంగా రాణించ‌డం ప‌ట్ల స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. ఆ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన ప్ర‌సిద్ధ్ కృష్ణ.. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, అతని ప్రదర్శన త‌న‌కు మాత్రం ఆశ్చ‌ర్యాన్ని కలిగించలేదని భార‌త ప్లేయ‌ర్ కేఎల్‌ రాహుల్ అంటున్నాడు.

వారిద్ద‌రిదీ క‌ర్ణాట‌క రాష్ట్ర‌మే. దీంతో ప్ర‌సిద్ధ్ ఆట‌తీరు గురించి రాహుల్ కు బాగా తెలుసు. అత‌డు బాగా ఆడ‌తాడ‌ని త‌న‌కు ముందే తెలుస‌ని, అందుకే అతని ఆట‌తీరు ప‌ట్ల అంద‌రిలా త‌న‌కు ఆశ్చ‌ర్యం ఏమీ క‌ల‌గ‌లేద‌ని వివ‌రించాడు. తాజాగా, కేఎల్ రాహుల్ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ...  కర్ణాటక నుంచి తదుప‌రి మరో ఆటగాడు నేష‌న‌ల్ టీమ్‌లోకి వ‌స్తే అది కచ్చితంగా ప్రసిద్ధే అవుతాడ‌ని నమ్మకంతో ఉండేవాడిన‌ని చెప్పాడు.

తామిద్ద‌రం ఒకే వయసు విభాగం వాళ్లం కాదని, అయినా జూనియర్‌ క్రికెట్లో, నెట్స్‌లో ప్ర‌సిద్ధ్‌ బౌలింగ్ ను‌ చూశాన‌ని తెలిపాడు. బౌలింగ్ తీరుతో అత‌డు మ‌న అంద‌రినీ ఆక‌ర్షించ‌గ‌ల‌డ‌ని అన్నాడు. ప్ర‌సిద్ధ్ పొడుగ్గా ఉంటాడ‌ని, వేగంగా బంతులేస్తాడని అన్నాడు. దేశవాళీ టోర్నీలో ఆడిన అనుభవంతో తాను ఈ విష‌యాన్ని చెబుతున్నాన‌ని, ప్ర‌సిద్ధ్ దూకుడు ప్రదర్శిస్తాడని తెలిపాడు.

ఆరంభ ఓవర్లలో పరుగులు స‌మ‌ర్పించుకున్న ప్ర‌సిద్ధ్ తిరిగి పుంజుకుని, కీలక వికెట్లు పడగొట్టాడ‌ని అన్నాడు. అరంగేట్ర మ్యాచులతోనే మ‌న క్రికెట‌ర్లు బాగా రాణిస్తున్నార‌ని, సూర్యకుమార్, ఇషాన్, కృనాల్, ఇప్పుడు ప్రసిద్ధ్ అద్భుతంగా రాణించార‌ని చెప్పాడు. తాను మూడు నెలలుగా మ్యాచ్‌లు ఆడకపోవడంతో ఇటీవ‌ల ముగిసిన టీ20 సిరీస్‌లో రాణించలేకపోయానని రాహుల్ అన్నాడు. జట్టులో ఉండాలంటే తీవ్రమైన పోటీని తట్టుకోవాల్సిందేన‌ని తెలిపాడు.


More Telugu News