తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా... ఆసక్తికర నిర్ణయాలు ప్రకటించిన సీఎం కేసీఆర్

  • ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ
  • ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలు పెంచుతామన్న సీఎం  
  • త్వరలో నిరుద్యోగులకు భృతి అందజేస్తామని వివరణ
  • పోడు భూములు సాగుచేసేవారికీ రైతుబంధు అమలు
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో సీఎం కేసీఆర్ ప్రసంగం అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడింది. కాగా, నేడు సభలో సీఎం కేసీఆర్ ఆసక్తికర నిర్ణయాలు వెల్లడించారు.

త్వరలోనే ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు పెంచుతామని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర మరువలేనిదని కొనియాడారు. ఆర్టీసీ ఉద్యోగులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని, బడ్జెట్ లో రూ.3 వేల కోట్లు కేటాయించామని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వేతనాల పెంపు ఉంటుందని స్పష్టం చేశారు. త్వరలోనే రవాణా శాఖ మంత్రితో చర్చించి ప్రకటన చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

ఇక నిరుద్యోగులకు కూడా ఊరట కలిగించే కబురు చెప్పారు. కరోనా వ్యాప్తి కారణంగా నిరుద్యోగ భృతి చెల్లించలేకపోయామని, త్వరలోనే నిరుద్యోగులను గుర్తించే ప్రక్రియకు శ్రీకారం చుడతామని అన్నారు. మిగతా రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతి అమలు తీరును పరిశీలిస్తున్నామని, కరోనా వ్యాప్తి అదుపులోకి వచ్చాక నిరుద్యోగ భృతి అందజేస్తామని తెలిపారు.

ఇతర అంశాలపై స్పందిస్తూ.... ఆర్థిక క్రమశిక్షణ పాటించిన 3 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని ఉద్ఘాటించారు. తెలంగాణ అప్పులు పెరగలేదని, ఎఫ్ఆర్ బీఎం పరిధికి లోబడే అప్పులు ఉన్నాయని స్పష్టం చేశారు. 22.8 శాతం అప్పుతో దేశంలో తెలంగాణ 25వ స్థానంలో ఉందని పేర్కొన్నారు.

ఇక వ్యవసాయ రంగంలో 17.73 శాతం పురోగతి సాధించడం సంతోషంగా ఉందన్నారు. నీటి పారుదల ప్రాజెక్టులపై వందల సంఖ్యలో కేసులు వేశారని, అయినప్పటికీ తాము ఆపలేదని అన్నారు. వ్యవసాయంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని నమ్ముతూ కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని వివరించారు.

త్వరలోనే పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని, పోడు భూములు సాగు చేసుకుంటున్నవారికీ రైతుబంధు ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. పంచాయతీ కార్యదర్శులకు రెగ్యులర్ కార్యదర్శులకు ఇచ్చే వేతనం ఇస్తామని చెప్పారు.

తెలంగాణ వస్తే రియల్ ఎస్టేట్ విలువ పడిపోతుందని శాపాలు పెట్టారని తెలిపారు. తెలంగాణలో భూముల ధరలు పెరిగాయని, ఏపీలో తగ్గాయని వివరించారు. ధరణి పోర్టల్ ద్వారా కోటిన్నర ఎకరాల భూమి రికార్డుల్లోకెక్కిందని పేర్కొన్నారు. ఇకపై ఎట్టిపరిస్థితుల్లోనూ భూ రికార్డులు తారుమారు అయ్యే పరిస్థితే లేదన్నారు.


More Telugu News