వరిసాగుపై తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు ఏపీ మంత్రి శ్రీరంగనాథరాజు ప్రకటన

  • వరిసాగు సోమరిపోతు వ్యవహారం అంటూ మంత్రి వ్యాఖ్యలు
  • భగ్గుమన్న రైతు సంఘాలు
  • ఏలూరులో ప్లకార్డులతో నిరసన
  • తిరుపతి ప్రెస్ క్లబ్ లో శ్రీరంగనాథరాజు మీడియా సమావేశం
  • రైతులకు క్షమాపణలు
వరిసాగు ఉత్త సోమరిపోతు వ్యవహారం అంటూ నిన్న వ్యాఖ్యలు చేసిన ఏపీ హౌసింగ్ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు రైతుల ఆగ్రహంతో వెనక్కి తగ్గారు. వరిసాగుపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని, రైతులకు క్షమాపణలు చెబుతున్నానని మంత్రి పేర్కొన్నారు. కాగా, నిన్న ఆయన వరిసాగు అంశంలో వ్యాఖ్యలు చేయగా, రైతు సంఘాలు మండిపడ్డాయి. ఏలూరులో రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టాయి. మంత్రి శ్రీరంగనాథరాజు వెంటనే రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో మంత్రి తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

ప్రభుత్వ పథకాలు కౌలు రైతులకు అందడంలేదని, ఆ పథకాల ఫలాలను భూ యజమానులే అనుభవిస్తున్నారని, రైతుబిడ్డను కావడంతో నిన్న అలా మాట్లాడానని వివరణ ఇచ్చారు. తాను తొందరపాటుతో ఈ వ్యాఖ్యలు చేశానని అంగీకరించారు. రైతులు ఎవరైనా బాధపడితే తనను క్షమించాలని కోరారు. రైతు సమావేశంలో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని ప్రకటన చేశారు.


More Telugu News