పవార్‌తో భేటీపై అమిత్‌ షా ఆసక్తికర వ్యాఖ్యలు... అనేక ఊహాగానాలకు తెరదీసిన హోంమంత్రి

  • అన్నీ బయటకు చెప్పలేం కదా? అని షా వ్యాఖ్య
  • భేటీ జరిగినట్లు వెల్లడించిన గుజరాత్‌ మీడియా
  • మరోవైపు అనిల్‌ దేశ్‌ముఖ్‌పై సంజయ్‌ రౌత్‌ కీలక వ్యాఖ్యలు
  • అధికార కూటమిలో భేదాభిప్రాయాలున్నాయన్న సంకేతాలు
  • ఈ తరుణంలో భేటీ వార్తలకు ప్రాధాన్యం
కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ రహస్యంగా భేటీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై గుజరాత్‌ మీడియా వర్గాలు కోడై కూస్తున్నాయి. అహ్మదాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో తమ పార్టీ నేత ప్రఫుల్‌ పటేల్‌తో కలిసి పవార్‌, షాను కలిసినట్లు వార్తలు గుప్పుమన్నాయి.

అయితే, ఆదివారం విలేకరులతో మాట్లాడిన అమిత్‌ షా దీనిపై తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. పవార్‌తో భేటీ నిజమేనా? అని విలేకరులు ప్రశ్నించగా.. ‘అన్నీ బయటకు చెప్పలేం కదా?’ అంటూ మరిన్ని ఊహాగానాలకు తెరలేపారు. భేటీ జరిగిందని కానీ, జరగలేదని కానీ.. ఏదీ ధ్రువీకరించకపోవడంతో ఇప్పుడు సర్వత్రా ఇదే చర్చనీయాంశంగా మారింది.

మహారాష్ట్రలో ‘మహా వికాస్‌ ఆఘాడీ’ కూటమి అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. దీనిలో శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీ భాగస్వాములుగా ఉన్నాయి. ముకేశ్‌ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు, హోంమంత్రిపై పోలీసు ఉన్నతాధికారి పరమ్‌వీర్‌ సింగ్‌ ఆరోపణలు వంటి పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వంలో భాగంగా ఉన్న పార్టీల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో అమిత్‌ షా, పవార్‌ భేటీ వార్తలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మరోవైపు అనిల్‌ దేశ్‌ముఖ్‌పై శివసేన నేత సంజయ్‌ రౌత్‌ ‘సామ్నా’ పత్రికలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన అనుకోకుండా హోంమంత్రి అయ్యారన్నారు. అయినా ముంబయి పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో వాజే కూర్చుని వసూళ్లకు తెరలేపిన విషయం హోంమంత్రికి తెలియకపోవడం ఏంటని ప్రశ్నించారు. రౌత్‌ వ్యాఖ్యలు, పవార్‌ రహస్య భేటీ పరిణామాలు అనేక ఊహాగానాలకు తావిస్తున్నాయి. మరోసారి మహారాష్ట్రలో రాజకీయాలు వేడెక్కే సూచనలు కనిపిస్తున్నట్లు రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.


More Telugu News