స్టాలిన్ చెప్పులతో తనను పోల్చడంపై ఆవేదన వ్యక్తం చేసిన సీఎం పళనిస్వామి

  • పళనిస్వామి సడన్ గా జన్మించాడన్న ఏ.రాజా
  • ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమన్న పళనిస్వామి
  • అలాంటి వాళ్లను దేవుడే శిక్షిస్తాడని వ్యాఖ్య
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిపై డీఎంకే సీనియర్ నేత ఏ.రాజా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. డీఎంకే అధినేత స్టాలిన్ చెప్పులతో పోల్చుతూ పళనిపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలపై పళనిస్వామి స్పందించారు. ఆయన వ్యాఖ్యలు చాలా బాధించాయని చెప్పారు. ఇలాంటి అసభ్యకరమైన భాషను వాడటం దారుణమని అన్నారు. తాను ఈ విషయాన్ని ఇక్కడితో ఆపేద్దామనుకుంటున్నానని... చుట్టూ మహిళలు ఉన్నారని... ఇంతకు మించి తాను ఏమీ మాట్లాడలేనని చెప్పారు. ఇలాంటి వారిని దేవుడే శిక్షిస్తాడని అన్నారు. ఆయన కూడా ఒక తల్లికే జన్మించారని... కానీ, ఇతరుల తల్లుల గురించి మాట్లాడతారని చెప్పారు.

తాను పేద కుటుంబంలో జన్మించానని... పేదరికంలోనే తాను పెరిగానని... తమను పెంచేందుకు తమ అమ్మ ఎంతో కష్టపడిందని పళని చెప్పారు. పేద అయినా, ధనిక అయినా... తల్లి స్థానం ఒకటేనని అన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న తనకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే, సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తులను దేవుడే శిక్షిస్తాడని చెప్పారు.

పళనిస్వామి గురించి ఏ.రాజా ఏమన్నారంటే... 'స్టాలిన్ అప్పట్లో మీసా చట్టం కింద ఒక ఏడాది శిక్షను అనుభవించారు. జిల్లా సెక్రటరీగా, జనరల్ కమిటీ సభ్యుడిగా, యూత్ వింగ్ సెక్రటరీ, ట్రెజరర్ గా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, కలైంగర్ చనిపోయాక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. స్టాలిన్ జన్మ సరైన పద్ధతిలో ఉంది. తల్లిదండ్రుల పెళ్లి తర్వాత తొమ్మిది నెలలకు ఆయన జన్మించారు. కానీ పళనిస్వామి నెలలు నిండకుండానే జన్మించినట్టున్నారు. అతని పుట్టుక సడన్ గా జరిగింది' అని వ్యాఖ్యానించారు.

ఒకప్పుడు బెల్లం మార్కెట్ లో పళనిస్వామి పని చేశారని చెప్పారు. అలాంటి వ్యక్తి స్టాలిన్ కు ఎలా సమానమవుతారు? అని ఎద్దేవా చేశారు. స్టాలిన్ ధరించే చెప్పులు పళనిస్వామి కంటే ఒక రూపాయి ఎక్కువ విలువైనవని దుయ్యబట్టారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి.


More Telugu News