తలనీలాల అంశంలో టీటీడీపై అనవసరంగా నిందలు వేస్తున్నారు: ఈవో ధర్మారెడ్డి

  • మయన్మార్, మిజోరం సరిహద్దుల్లో తలనీలాల పట్టివేత
  • 120 సంచులను స్వాధీనం చేసుకున్న అధికారులు
  • టీటీడీకి చెందినవేనంటూ ప్రచారం
  • ఖండించిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి
మయన్మార్, మిజోరం సరిహద్దుల్లో తలనీలాలు 120 సంచుల నిండా పట్టుబడగా, అవి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి చెందినవేనంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. సరిహద్దుల్లో పట్టుబడిన తలనీలాలు టీటీడీకి చెందినవి కావని స్పష్టం చేశారు. కస్టమ్స్ అధికారులకు పట్టుబడిన తలనీలాలు శుద్ధి చేయనటువంటివని, టీటీడీ ఎప్పుడూ శుద్ధి చేయకుండా తలనీలాలు విక్రయించదని వివరించారు.

తిరుమల నుంచి కట్టుదిట్టమైన భద్రత మధ్య తలనీలాలను తిరుపతికి తరలిస్తామని, ఈ క్రమంలో అవినీతి జరిగేందుకు ఏమాత్రం ఆస్కారం లేదని ధర్మారెడ్డి అన్నారు. తాము ఎంతో పారదర్శకంగా తలనీలాలను విక్రయిస్తామని చెప్పారు. మిజోరం పోలీసులు నమోదు చేసిన కేసులో టీటీడీ ప్రస్తావనే లేదని, సోషల్ మీడియాలో టీటీడీపై అనవసరంగా నిందలు వేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.

తలనీలాల అంశంలో టీడీపీ తీవ్ర విమర్శలు చేస్తుండడం తెలిసిందే. ఇప్పటిదాకా జగన్ రెడ్డి బ్యాచ్ శేషాచలం నుంచి చైనాకు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తుండేదని, ఇప్పుడు తలనీలాలు కూడా సరిహద్దులు దాటిస్తున్నారని ఆరోపించింది.


More Telugu News