12-15 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్.. ప్రభుత్వ అనుమతి కోరిన ఫైజర్

  • ఫైజర్, బయోఎన్‌టెక్ కలిసి అభివృద్ధి
  • అమెరికా ఎఫ్‌డీఏ అనుమతి కోరుతూ దరఖాస్తు
  • ట్రయల్స్‌లో అత్యుత్తమ ఫలితాలు కనిపించాయన్న ఫైజర్
ఇప్పటి వరకు 16 ఏళ్లు నిండిన వారికి మాత్రమే అందుబాటులో ఉన్న కరోనా టీకా ఇకపై పిల్లలకూ అందుబాటులోకి రానుంది. పలు ఫార్మాస్యూటికల్ కంపెనీలు పిల్లలు, చిన్నారుల కోసం వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. ఈ విషయంలో ఫార్మాస్యూటికల్ దిగ్గజం ఫైజర్ సంస్థ అందరికంటే ఒక అడుగు ముందే ఉంది. 12-15 ఏళ్ల మధ్యనున్న పిల్లలకు వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ)కు ఫైజర్ దరఖాస్తు చేసుకుంది. మున్ముందు ఇతర దేశాల అనుమతి కూడా కోరనున్నట్టు ఫైజర్ పేర్కొంది.

ఫైజర్, జర్మనీ సంస్థ బయోఎన్‌టెక్‌ కలిసి అభివృద్ది చేసిన ఈ టీకా 12-15 ఏళ్ల మధ్యనున్న చిన్నారుల్లో వందశాతం ప్రభావవంతంగా పనిచేసినట్టు ఈ సంస్థలు పేర్కొన్నాయి. ట్రయల్స్‌లో అత్యుత్తమ ఫలితాలు వచ్చాయని తెలిపాయి. టీకా వేసినప్పుడు పెద్దల్లో కనిపించిన లక్షణాలే చిన్నారుల్లోనూ కనిపించాయని, అంతకుమించి ప్రతికూల ప్రభావాలేవీ నమోదు కాలేదని ఫైజర్ పేర్కొంది.


More Telugu News