కొవిడ్ లక్షణాలు ఉన్నవారు ఎక్కడికి వెళ్లాలో అధికారులు చెప్పాలి: సీఎం జగన్

  • ఏపీపై కరోనా పంజా
  • వెల్లువలా వస్తున్న కొత్త కేసులు
  • తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష
  • కరోనా రోగులకు సహాయ సహకారాలు అందించాలని ఆదేశం
  • ఫోన్ చేస్తే 3 గంటల్లో బెడ్ ఏర్పాటు చేయాలని స్పష్టీకరణ
రాష్ట్రంలో కరోనా నివారణ, వ్యాక్సినేషన్ పై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏపీలో కొవిడ్ పరిస్థితులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కొవిడ్ సోకిన వారికి సహాయ సహకారాలు అందించాలని, కొవిడ్ లక్షణాలు ఉన్నవారు ఎక్కడికి వెళ్లాలో చెప్పాలని అన్నారు. ఫోన్ ద్వారా సమాచారం అందిస్తే 3 గంటల్లోగా బెడ్ కేటాయించాలని స్పష్టం చేశారు. ఆసుపత్రుల్లో అవసరమైన దానికంటే అధికంగా ఆక్సిజన్ అందుబాటులో ఉంచాలని సూచించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 104 కాల్ సెంటర్ కు మరింత ప్రాచుర్యం కల్పించాలని అన్నారు.

ఇక, వ్యాక్సినేషన్ పై స్పందిస్తూ రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 6 లక్షల 21 వేల కరోనా వ్యాక్సిన్ డోసులు ఇచ్చామని సీఎం జగన్ వెల్లడించారు. ఆరోగ్య కేంద్రాల సిబ్బంది, గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది అందరూ శ్రమించడం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరత ఏర్పడినందున కేంద్రానికి లేఖ రాయాలని అధికారులకు సూచించారు. ఒకవేళ అవసరమైన పక్షంలో తాను కూడా లేఖ రాస్తానని సీఎం జగన్ వెల్లడించారు.

తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితరులు హాజరయ్యారు.


More Telugu News