ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్‌ ఖలీద్‌కు బెయిల్‌ మంజూరు

  • సీఏఏకు వ్యతిరేకంగా గత ఏడాది ఢిల్లీలో అల్లర్లు
  • 50 మంది మరణం, 200 మందికి గాయాలు
  • కుట్రలో ఖలీద్‌ హస్తముందని పోలీసుల ఛార్జ్‌షీట్‌
  • అక్టోబర్‌లో అరెస్ట్‌ చేసిన ఢిల్లీ పోలీసులు
గత ఏడాది ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్ల కేసులో అరెస్టయిన జేఎన్‌యూ మాజీ విద్యార్థి నాయకుడు ఉమర్‌ ఖలీద్‌కు ఢిల్లీ కోర్టు ఎట్టకేలకు బెయిల్‌ మంజూరు చేసింది. జైలును విడిచి వెళ్లడానికి ముందు తన ఫోన్‌లో ఆరోగ్య సేతు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఆదేశించింది. దేశంలో కరోనా ఉద్ధృతిని దృష్టి ఉంచుకొని కోర్టు ఈ సూచన చేసింది.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గత ఏడాది ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో తీవ్ర స్థాయిలో ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ అల్లర్లలో దాదాపు 50 మంది మరణించారు. మరో 200 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఈ హింసకు ప్రణాళికలు రచిస్తూ షహీన్‌ బాగ్‌లో నిర్వహించిన సమావేశంలో ఖలీద్‌ పాల్గొన్నట్లు ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ పోలీసులు అభియోగపత్రంలో పేర్కొన్నారు. అక్టోబర్‌లో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.

అలాగే, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, బిహార్‌, మహారాష్ట్రలో జరిగిన ఆందోళనల్లోనూ ఖలీద్‌ పాల్గొని విద్వేషపూరిత ప్రసంగాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.


More Telugu News