ప్రైవేట్ ఆసుపత్రులకు వార్నింగ్ ఇచ్చిన కర్ణాటక వైద్యశాఖ మంత్రి

  • కరోనా రోగులకు ప్రైవేట్ ఆసుపత్రులు బెడ్లను రిజర్వ్ చేయాలి
  • అత్యవసరమైతే తప్ప నాన్ కోవిడ్ పేషెంట్లకు చికిత్స చేయొద్దు
  • ప్రభుత్వ ఉత్తర్వులను పట్టించుకోకపోతే కఠిన చర్యలు తప్పవు
కర్ణాటకలో ఊహించని విధంగా కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క పేషెంట్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం అలర్ట్ అయింది. ప్రైవేట్ ఆసుపత్రులకు కర్ణాటక వైద్యశాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్ వార్నింగ్ ఇచ్చారు. కరోనా రోగులకు ప్రైవేట్ ఆసుపత్రులు బెడ్లను రిజర్వ్ చేయాలని, పడకలను కేటాయించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు కోవిడ్ స్పెషలిస్టులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

కరోనా రోగుల కోసం బెడ్లను కేటాయించాలని గత 15 రోజులుగా కోరుతున్నామని సుధాకర్ చెప్పారు. అయితే, వారు కేవలం 15 నుంచి 20 శాతం బెడ్లను మాత్రమే కేటాయిస్తున్నాారని మండిపడ్డారు. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని... ప్రభుత్వ ఉత్తర్వులను పట్టించుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితి ఉంటేనే నాన్ కోవిడ్ పేషెంట్లకు చికిత్స అందించాలని చెప్పారు. కరోనా రోగులకు చికిత్స అందించకపోతే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.


More Telugu News