ఆక్సిజన్ కోసం నేను ఫోన్ చేస్తే నరేంద్ర మోదీ కనీసం స్పందించలేదు:ఉద్ధవ్ థాకరే!

  • మహారాష్ట్రలో నిండుకున్న ఆక్సిజన్
  • మూడు సార్లు ఫోన్ చేసినా మాట్లాడలేదు
  • ఆరోపించిన ఉద్ధవ్ థాకరే
  • కంపెనీలను ఆక్రమిస్తామన్న మహారాష్ట్ర మంత్రి
మహారాష్ట్రలో కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తూ, కేసుల సంఖ్య పెరిగి, ఆక్సిజన్ నిల్వలు తగ్గిపోయిన వేళ, తమను ఆదుకోవాలని కోరేందుకు సీఎం ఉద్ధవ్ థాకరే, ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేయగా, ఆయన అందుబాటులో లేకుండా పోయారని థాకరే కార్యాలయ వర్గాలు వెల్లడించారు. బెంగాల్లో జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా ప్రచారంతో ఆయన బిజీగా ఉన్నారంటూ థాకరే స్వయంగా వెల్లడించడంతో మరోమారు మహారాష్ట్ర, కేంద్రం మధ్య రాజకీయ దుమారం చెలరేగింది.

"సీఎం ఉద్ధవ్ థాకరే శనివారం ఉదయం 10.30 గంటలకు ప్రధానికి ఫోన్ చేశారు. ఆయన అంతకుముందు రెండు సార్లు నరేంద్ర మోదీతో మాట్లాడాలని ప్రయత్నించి విఫలం అయ్యారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన బిజీగా ఉన్నారని, వచ్చిన తరువాత మాట్లాడతారని పీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి" అని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.

నిన్న ప్రధాని బెంగాల్ లోని అసన్ సోల్, గంగారాంపూర్ ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారన్న సంగతి తెలిసిందే. మోదీ తనతో మాట్లాడలేదని ఆరోపించడాన్ని కేంద్రం ఆక్షేపించింది. థాకరే చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని పేర్కొంది. రెండు రోజుల క్రితం, తమ రాష్ట్రానికి ఆక్సిజన్ తో పాటు రెమిడెసివిర్ ఔషధాన్ని పంపించాలని ఉద్ధవ్ థాకరే, ప్రధానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే, థాకరే విజ్ఞప్తిపై ప్రధాని కార్యాలయం స్పందించలేదు.

ఇదిలావుండగా, తాము రెమిడెసివిర్ కోసం 16 కంపెనీలను సంప్రదించామని, తమకు ఔషధాన్ని సరఫరా చేయవద్దని కొన్ని కంపెనీలకు పై నుంచి ఆదేశాలు అందాయని మైనారిటీ వ్యవహారాల మంత్రి నవాబ్ మాలిక్ సంచలన ఆరోపణలు చేయడం గమనార్హం. తమకు ఇక మరో మార్గం కనిపించడం లేదని, రాష్ట్రంలో ఔషధాలు తయారు చేస్తున్న కంపెనీల నుంచి బలవంతంగా స్వాధీనం చేసుకోవడం మాత్రమే మిగిలిందని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం సైతం కేంద్రంపై విమర్శలు చేశారు. ప్రజలు కరోనాతో మరణిస్తుంటే, ప్రచారాలు, పర్యటనలు ఎందుకని ప్రశ్నించారు. ఢిల్లీలో కూర్చుని పరిస్థితులను నియంత్రణలోకి తేవాలని సూచించారు. కరోనా సెకండ్ వేవ్ ఇంతలా వ్యాపించడానికి కేంద్రంతో పాటు ఎన్నికల కమిషన్ కూడా కారణమని శివసేన వ్యాఖ్యానించగా, మోదీకి ప్రాణాల కన్నా రాజకీయాలు ముఖ్యమయ్యాయని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.




More Telugu News