ఆ ఐదు సిటీల్లో లాక్​ డౌన్​ అవసరం లేదు: అలహాబాద్​ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే

  • ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఊరట
  • ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలని సర్కార్ కు ఆదేశం
  • వారంలో హైకోర్టుకు నివేదిక సమర్పించాలని ఉత్తర్వులు
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. లక్నో, ప్రయాగ్ రాజ్, వారణాసి, కాన్పూర్, గోరఖ్ పూర్ లలో ఈ నెల 26 వరకు లాక్ డౌన్ పెట్టాలన్న అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆ ఐదు నగరాల్లో లాక్ డౌన్ అవసరం లేదని పేర్కొంటూ హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. ఆ ఐదు సిటీల్లో లాక్ డౌన్ పెట్టాలంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని అలహాబాద్ హైకోర్టు నిన్న ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ యూపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఆ పిటిషిన్ ను మంగళవారం విచారించిన ధర్మాసనం.. లాక్ డౌన్ అవసరం లేదని పేర్కొంది. అదే సమయంలో మహమ్మారి కట్టడికి ఏ చర్యలు తీసుకున్నారో హైకోర్టుకు వివరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వారంలోగా నివేదికను సమర్పించాల్సిందిగా ఆదేశాలిచ్చింది. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది కదా అని లాక్ డౌన్ విధిస్తే.. ప్రజల జీవితాలపై పెను ప్రభావం పడుతుందని యూపీ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా కట్టడికి అవసరమైన చర్యలన్నీ తీసుకుంటున్నామని సుప్రీంకోర్టుకు వెల్లడించింది.


More Telugu News