వ్యాక్సినేషన్ లో ఇండియా వరల్డ్ రికార్డు!

  • 99 రోజుల వ్యవధిలో 14 కోట్లకు పైగా టీకా డోస్ ల పంపిణీ
  • నాలుగో దశలో మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్
  • వెల్లడించిన కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ
ఓవైపు కరోనా కొత్త కేసులు పెరుగుతున్న వేళ, దేశ ప్రజలకు వ్యాక్సిన్ ను అందించడంలో ఇండియా సరికొత్త రికార్డును సృష్టించింది. కేవలం 99 రోజుల వ్యవధిలో 14 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ ను ఇచ్చినట్టు కేంద్రం ప్రకటించింది. శనివారం రాత్రి వరకూ 14,08,02,794 టీకా డోస్ లను అందించామని, ప్రపంచంలో మరే దేశం కూడా ఈ ఫీట్ ను సాధించలేదని కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.

టీకా తీసుకున్న వారిలో 92.89 లక్షల మంది ఆరోగ్య శాఖ సిబ్బందికి తొలి డోస్ ను అందించామని, వీరిలో 59.94 లక్షల మందికి రెండో డోస్ కూడా అందిందని అదికారులు పేర్కొన్నారు. ఆపై 1.19 కోట్ల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లకు తొలి డోస్ అందిందని, వీరిలో 62.77 లక్షల మందికి రెండో డోస్ ను కూడా ఇచ్చామని వెల్లడించారు. ఇక 45 నుంచి 60 ఏళ్లు పైబడిన వారిలో 4.76 కోట్ల మందికి తొలి డోస్, వారిలో 23.22 లక్షల మందికి రెండో డోస్ అందిందని పేర్కొన్నారు.

60 సంవత్సరాలు దాటిన వారిలో 4.96 కోట్ల మందికి తొలి డోస్ ను, వారిలో 77.02 లక్షల మందికి రెండో డోస్ ను ఇచ్చామని అధికారులు వెల్లడించారు. ఇండియాలో తొలి దశ వ్యాక్సినేషన్ కార్యక్రమం జనవరి 16న ప్రారంభమైన సంగతి తెలిసిందే.  ఆపై రెండో దశ మార్చి 1 నుంచి, మూడవ దశ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైంది. మొత్తం 99 రోజుల వ్యవధిలోనే 14 కోట్ల డోస్ లను పంచామని తెలిపారు. నాలుగో దశలో భాగంగా మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలను ఇస్తామని, అందుకోసం రిజిస్ట్రేషన్లను ప్రారంభించామని ఉన్నతాధికారులు గుర్తు చేశారు.



More Telugu News