నందిగ్రామ్‌లో నాలుగో రౌండ్‌ ముగిసే సమయానికి మ‌మ‌తా బెన‌ర్జీ క‌న్నా 8 వేల‌ ఓట్ల‌ ఆధిక్యంలో సువేందు అధికారి

  • నాలుగో రౌండ్‌ ముగిసే సమయానికి మ‌మ‌తా బెన‌ర్జీ వెనుకంజ
  • ఎన్నికలకు ముందు టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన సువేందు అధికారి
  • బెంగాల్‌లో మ్యాజిక్ ఫిగ‌ర్ దాటిన తృణ‌మూల్
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా ప‌య‌నిస్తున్న‌ప్ప‌టికీ దీదీ మాత్రం నందిగ్రాంలో వెన‌క‌బ‌డ్డారు. ఆ నియోజ‌క వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా ఆమె బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిపై పోటీ చేసిన విష‌యం తెలిసిందే.  

నాలుగో రౌండ్‌ ముగిసే సమయానికి మ‌మ‌తా బెన‌ర్జీ క‌న్నా సువేందు అధికారి 8,000 ఓట్ల‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎన్నికలకు ముందు టీఎంసీ నుంచి సువేందు అధికారి బీజేపీలో చేరగా, మ‌మ‌తా బెన‌ర్జీ పంతం ప‌ట్టి ఆయ‌న‌ను ఓడించి తీరాలన్న ఉద్దేశంతో నందిగ్రామ్ నుంచే పోటీ చేశారు.

ఆయ‌న‌పై అల‌వోక‌గా గెలుస్తాన‌ని, అంతేగాక‌, రాష్ట్రంలో ఎక్క‌డి నుంచి పోటీ చేసినా గెలుస్తాన‌ని ఆమె స‌వాళ్లు విసిరారు. చివ‌ర‌కు ఆమె భారీ ఓట్ల‌తో వెన‌క‌ప‌డిపోతుండ‌డం గ‌మ‌నార్హం. కాగా, తృణమూల్‌ కాంగ్రెస్ ఆ రాష్ట్రంలో 160 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మొత్తం 292 అసెంబ్లీ స్థానాలకు గానూ ఎన్నిక‌లు జ‌రిగాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 147 స్థానాల్లో గెల‌వాల్సి ఉంది. ఇప్ప‌టికే తృణ‌మూల్ కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగ‌ర్‌ను దాటి ఆధిక్యంలో కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ మ‌మ‌తా బెన‌ర్జీ మాత్రం వెన‌క‌బ‌డి పోవ‌డం హాట్ టాపిక్‌గా మారింది.






More Telugu News