ఊపిరి పీల్చుకుంటున్న ముంబై... లాక్ డౌన్ తో 4 వేల లోపునకు కేసులు!

  • గత కొన్ని వారాలుగా భారీగా పెరిగిన కేసులు
  • కఠిన నిబంధనల అమలుతో నియంత్రణలోకి
  • ఆదివారం 3,629 కొత్త కేసులు
గత కొన్ని వారాలుగా కరోనా విజృంభణతో అల్లాడుతున్న దేశ ఆర్థిక రాజధాని ముంబై, కాస్తంత ఊపిరి పీల్చుకుంది. నగరంలో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తుండటంతో, కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఆదివారం నాడు ముంబైలో కొత్తగా 3,629 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇదే సమయంలో 73 మంది మహమ్మారి కారణంగా కన్నుమూశారు.

ఇప్పటివరకూ ముంబైలో 6.55 లక్షల మందికి పైగా కరోనా సోకగా, 13 వేల మందికి పైగా మరణించారు. మొత్తం మహారాష్ట్రలో 47.22 లక్షలకు పైగా కేసులు రాగా, 70 వేల మందికి పైగా మరణించారు. ఇక, ఆదివారం నాడు కరోనా నుంచి 51,356 మంది కోలుకోవడంతో, ఆసుపత్రుల్లో సైతం వేలాది బెడ్లు అందుబాటులోకి వచ్చాయి. రికవరీ రేటు 84.31 శాతానికి పెరిగిందని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

 ప్రస్తుతం మహారాష్ట్రలో 6.68 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని అన్నారు. ఇక, కరోనా టీకాలను ప్రస్తుతానికి 18 నుంచి 45 ఏళ్ల లోపు వయసున్న వారికే ఇవ్వాలని నిర్ణయించామని పేర్కొన్న బీఎంసీ అధికారులు, 45 ఏళ్లు పైబడిన వారు టీకాల కోసం రావద్దని సూచించారు. నగరంలో వ్యాక్సిన్ కొరత అధికంగా ఉందని, టీకాలు సరఫరా కాగానే, మరింత మందికి ఇస్తామని స్పష్టం చేశారు.



More Telugu News