రాష్ట్రం శవాల గుట్టగా మారుతుంటే, తాడేపల్లి ఇంట్లో గురుమూర్తికి  శాలువాలు కప్పుతున్నారు: సీఎం జగన్ పై లోకేశ్ ఫైర్

  • అసిరినాయుడు అనే వలసకూలీ మృతి
  • కరోనా సోకితే ఎవరూ పట్టించుకోలేదన్న లోకేశ్
  • భార్యా, పిల్లల ముందు అనాథలా చనిపోయాడని వెల్లడి
  • 104, 108 అంబులెన్సులు ఏవీ అంటూ ఆగ్రహం
  • నీ చేతకానితనం వల్లే ఈ చావులు అంటూ విమర్శలు
అసిరినాయుడు అనే వలసకూలీ కరోనాతో అత్యంత విషాదకర పరిస్థితుల్లో కన్నుమూయడం పట్ల టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ తీవ్రస్థాయిలో స్పందించారు. కరోనా ప్రభావంతో ఏపీ శవాలగుట్టగా మారుతుంటే, అభినవ నీరో చక్రవర్తి వైఎస్ జగన్ తాడేపల్లి ఇంట్లో తన వ్యక్తిగత ఫిజియోథెరపిస్ట్ గురుమూర్తికి శాలువాలు కప్పుతున్నాడని మండిపడ్డారు. విజయవాడలో కరోనా సోకిన వలసకూలీ అసిరినాయుడి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోని ఆరోగ్యశాఖకు ఏం అనారోగ్యం వచ్చింది? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వలసొచ్చిన నగరం పొమ్మంటే, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సొంతూరు జి.సిగడాం మండలం కొయ్యానపేట పల్లెకి పోతే, అసిరినాయుడును స్థానికులు ఊళ్లోకి కూడా రానివ్వలేదని వెల్లడించారు. వలంటీర్లు ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. చివరికి భార్య, పిల్లల ముందే అసిరినాయుడు అనాథలా కన్నుమూశాడని లోకేశ్ వివరించారు. మానవత్వంలేని ముఖ్యమంత్రీ... నీ చేతకాని పాలనవల్లే ఈ అన్యాయమైన అకాల మరణాలు అని విమర్శించారు.

విజయవాడలో ఊరేగించి విజయసాయిరెడ్డి అల్లుడికి కట్నంగా చదివించిన 104, 108 అంబులెన్సులు ఏవీ? అని ప్రశ్నించారు. "నీ బంధువులకు కట్టబెట్టిన కాల్ సెంటర్ ఏమైంది? ఫోన్ చేసిన 3 గంటల్లో బెడ్ కాదు కదా, చివరికి శ్మశానంలో పాడె కూడా దొరకడంలేదు" అంటూ లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


More Telugu News