వారం రోజులుగా జాడలేని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు.. పలు అనుమానాలు!

  • ఈటలతో సన్నిహిత సంబంధాలు
  • ఆయనతో కలిసి వ్యాపార లావాదేవీలు
  • గుర్రుగా ఉన్న కేసీఆర్
  • పోలీసులకు ఫిర్యాదు చేయని కుటుంబ సభ్యులు
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న టీఆర్ఎస్ నేత, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు వారం రోజులుగా పత్తా లేకుండా పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆయన ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేసి ఉంది. ఈటలతో సన్నిహిత సంబంధాలున్న పుట్ట మధు ఆయనతో కలిసి వ్యాపార లావాదేవీలు నిర్వహించారని, దీనిపై కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. దీనికితోడు హైకోర్టు న్యాయవాదులు వామన్‌రావు దంపతుల హత్య కేసులో పుట్ట మధుపై ఆరోపణలు రాగా, పోలీసులు విచారణ జరుపుతున్నట్టు సమాచారం.

అలాగే, కాంగ్రెస్ నేత దుద్దిళ్ల శ్రీధర్‌బాబును టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించడంపై గుర్రుగా ఉండడం వల్లే మధు అజ్ఞాతంలోకి వెళ్లినట్టు చెబుతున్నారు. ఇంకోవైపు, మధు వారం రోజులుగా కనిపించకున్నా ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, పుట్ట మధు ఎక్కడున్నారన్న విషయం పోలీసులకు, కుటుంబ సభ్యులకు తెలుసని ప్రచారం జరుగుతోంది. మధు వెంట గన్‌మన్లు ఉన్నారని రామగుండం పోలీస్ కమిషనర్ చెప్పడం ఈ అనుమానాలను బలపరుస్తోంది.


More Telugu News