బుమ్రాకు నేను చాలా పెద్ద అభిమానిని: వెస్టిండీస్‌ మాజీ దిగ్గజ బౌలర్‌ ఆంబ్రోస్‌

  • టెస్టుల్లో 400 వికెట్లు పడగొట్టగలడని ఆశాభావం
  • ఫిట్‌నెస్‌తో పాటు సుదీర్ఘకాలం ఆడితే సాధ్యం
  • బుమ్రా బాల్‌ డెలివరీ ప్రత్యేకమైనదని వ్యాఖ్య
  • బంతిని ఎలానైనా తిప్పే సామర్థ్యం అతని సొంతం
  • ఓ ఇంటర్వ్యూలో తన మనోగతాన్ని వెల్లడించిన ఆంబ్రోస్‌
భారత క్రికెట్‌ జట్టులో అత్యుత్తమ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాకు తాను పెద్ద అభిమానినని వెస్టిండీస్‌కు చెందిన మాజీ మేటి ఫాస్ట్ బౌలర్‌ ఆంబ్రోస్‌ తెలిపారు. ఇప్పటి వరకు తాను చూసిన వారిలో బుమ్రా చాలా ప్రత్యేకమైనవాడని పేర్కొన్నారు. టెస్టు క్రికెట్‌లో 400 వికెట్లు పడగొట్టే సామర్థ్యం అతనికి ఉందన్నారు. అయితే, అందుకు అతను ఫిట్‌నెస్‌ మెయింటైన్ చేస్తూ సుదీర్ఘకాలం ఆడాల్సిన అవసరం ఉంటుందన్నారు. అప్పుడే ఆ లక్ష్యాన్ని చేరుకోగలడని తెలిపారు.

స్వింగ్‌, సీమ్‌, యార్కర్‌ ఇలాంటి బంతిని ఎలానైనా తిప్పే సామర్థ్యం బుమ్రాకు ఉందని ఆంబ్రోస్‌ తెలిపారు. అతని అమ్ములపొదిలో ఇలా అస్త్రాలున్నాయన్నారు. ఇలాగే సుదీర్ఘకాలం ఆడగలిగితే మాత్రం బుమ్రా తప్పకుండా 400 వికెట్లు పడగొడతాడని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫాస్ట్‌ బౌలింగ్‌కు రిథమ్‌ చాలా అవసరమని.. అది బుమ్రాకు ఉందని తెలిపారు. బాల్‌ను డెలివర్ చేయడానికి ముందు ఎక్కువ దూరం నడుస్తాడని.. కేవలం రెండు, మూడు జాగ్స్ మాత్రమే చేస్తాడని వివరించాడు.

ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యుత్తమ మేటి ఫాస్ట్‌ బౌలర్లలో ఆంబ్రోస్ ఒకరు. 80వ దశకం చివరి నుంచి 2000 ఆరంభం వరకు వెస్టిండీస్‌కు ప్రాతినిధ్యం వహించారు. అప్పట్లో  అత్యంత కఠినమైన ఓపెనింగ్ బౌలర్లలో ఆంబ్రోస్ ఒకరు. టెస్టు క్రికెట్‌లో 405, వన్డేల్లో 225 వికెట్లు పడగొట్టారు.


More Telugu News