కాల్పులతో దద్దరిల్లిన అమెరికా.. 11 మంది మృత్యువాత

  • అమెరికాలో మరోమారు గర్జించిన గన్
  • పుట్టిన రోజు వేడుకలలో కాల్పులు.. ఏడుగురి మృతి
  • ఉడ్‌ల్యాండ్‌లో పొరిగింటి వారిపై కాల్పుల్లో ముగ్గురి మృత్యువాత
అమెరికాలో గన్ మరోమారు గర్జించింది. రెండు వేర్వేరు ఘటనల్లో 11 మందిని పొట్టనపెట్టుకుంది. కొలరాడోలోని ఓ మొబైల్ హోం పార్క్‌లో ఓ కుటుంబం పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటోంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన నిందితుడు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వేడుకలో పాల్గొన్న చిన్నారులకు ఎలాంటి గాయాలు కాలేదని, వారు తమ బంధువుల వద్ద సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. పార్టీ చేసుకుంటున్న కుటుంబంలోని మహిళకు నిందితుడు బాయ్‌ఫ్రెండేనని పోలీసులు నిర్ధారించారు. కాల్పులు జరిపిన అనంతరం నిందితుడు తనను తాను కాల్చుకుని చనిపోయాడు. బాధితులు, నిందితుడి పేర్లను పోలీసులు వెల్లడించలేదు. 

ఉడ్‌ల్యాండ్‌లో జరిగిన మరో ఘటనలో ముగ్గురు మృతి చెందారు. నిందితుడు తన పొరుగు ఇంటిలోకి ప్రవేశించి కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం నిందితుడు ఆ ఇంటికి నిప్పు పెట్టాడు.  ఎదురు కాల్పుల్లో అతడు హతమైనట్టు పోలీసులు తెలిపారు.


More Telugu News