సంక్షోభంలో చిక్కుకున్న భారత్‌కు సాయం చేద్దాం రండి: పిలుపునిచ్చిన ‘లాన్సెట్’

  • అంతర్జాతీయ సమాజానికి 8 సూచనలు చేసిన ‘లాన్సెట్’
  • మహమ్మారిని అష్టదిగ్భంధనం చేయాలని పిలుపు
  • మేథో సంపత్తి హక్కులు రద్దు చేసిన అమెరికాపై ప్రశంసలు
కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకుని సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న భారత్‌ను అదుకుందాం రమ్మంటూ లాన్సెట్ జర్నల్ అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చింది. ‘ఎ కాల్ ఫర్ ఇంటర్నేషనల్ యాక్షన్’ పేరుతో నిన్నటి సంచికలో ప్రత్యేక వ్యాసాన్ని ప్రచురించింది. దేశాలన్నీ ముందుకొచ్చి మహమ్మారిని అష్టదిగ్బంధనం చేయాలని కోరింది. ఇందుకోసం 8 సూచనలు చేసింది.

ఇందులో మొదటిది.. భారత్‌ ఆక్సిజన్ అవసరాలు తీర్చడం. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వెంటిలేటర్లు, మందులు, టీకాలు, పీపీఈ కిట్లు విరాళంగా ఇవ్వడం. అలాగే, మురికివాడల్లోని ప్రజలకు నాణ్యమైన మాస్కులు, పల్స్ ఆక్సీమీటర్లు, ఆహారం అందించడంతోపాటు ఆర్థిక చేయూత అందించడం.

రెండోది వ్యాక్సిన్లకు సంబంధించి మేథో సంపత్తి హక్కుల్ని రద్దు చేయాలి. మిగులు టీకాలు కలిగిన సంపన్న దేశాలు వాటిని భారత్‌కు పంపాలి. ఇప్పటికే టీకాలపై మేథో సంపత్తి హక్కులను అమెరికా రద్దు చేయడాన్ని లాన్సెట్ స్వాగతించింది.

మూడోది.. వైరస్ జన్యు పరిణామ క్రమాన్ని విశ్లేషించేందుకు అంతర్జాతీయ సమాజం భారత్‌కు మద్దతివ్వాలి.

నాలుగోది.. పనిచేసీ చేసి అలసిపోయిన భారత్‌లోని వైద్యులపై ఒత్తిడి తగ్గించేందుకు సుశిక్షితులైన సిబ్బందిని వారికి జోడించాలి. అంతర్జాతీయ సమాజం తమ సేవలను విస్తరించడం ద్వారా వైద్యులపై ఒత్తిడి తగ్గించడం.

మానవతా సంస్థలు వైద్య సిబ్బందిని భారత్‌కు పంపి రోగులకు సేవలు అందించేలా చూడడం ఐదోది. విదేశీ వైద్య నిపుణులు భారత్‌లో పనిచేసేందుకు కేంద్రం తాత్కాలిక లైసెన్సులు మంజూరు చేయడం.

ఆరోది.. అత్యవసర మందుల సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా అంతర్జాతీయ సమాజం ముందుకు రావడం.

భారత్‌లో పరిస్థితి దక్షిణాసియాకు విపత్తుగా మారిన నేపథ్యంలో ప్రయాణాలపై ఆంక్షలు విధించడం ఏడోది. భారత్ నుంచి వచ్చే వారిని క్వారంటైన్‌కు పంపడం ద్వారా సరిహద్దు దేశాల్లో వ్యాప్తిని అరికట్టడం.

చివరిగా.. భారత్‌లో కరోనా కేసులు, మరణాలు కచ్చితంగా నమోదయ్యేలా చూడడం. కొవిడ్‌ను అరికట్టేందుకు శాస్త్రీయ ఆధారిత చర్యలు తీసుకునేందుకు ప్రపంచ నేతలు కలిసి పనిచేయడం. రీ ఇన్‌ఫెక్షన్ వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడం.


More Telugu News