కొత్త వేరియంట్లపై వ్యాక్సిన్ పనితీరు ఎంత అనేది ఇంకా తెలియదు: ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా

  • భారత్ లో కరోనా వైరస్ విలయతాండవం
  • కొనసాగుతున్న వ్యాక్సినేషన్
  • ముప్పు ఇంకా తొలగిపోలేదన్న రణదీప్ గులేరియా
  • తప్పనిసరిగా మాస్కులు ధరించాలని స్పష్టీకరణ
  • భౌతికదూరం పాటించాలని సూచన
కరోనా రక్కసి పలు రకాలుగా జన్యు రూపాంతరం చెంది మానవాళికి మరింత ముప్పుగా పరిణమిస్తున్న వేళ ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ అనేక విధాలుగా రూపు మార్చుకుంటున్నందున, ఇప్పటి వ్యాక్సిన్లు దానిపై ఎంతమేర పనిచేస్తున్నాయన్న దానిపై స్పష్టత లేదని అన్నారు.

అందుకే వ్యాక్సిన్ 2 డోసులు తీసుకున్నప్పటికీ అప్రమత్తంగా ఉండక తప్పదని స్పష్టం చేశారు. మాస్కు తప్పనిసరిగా ధరించాలని, విధిగా భౌతికదూరం పాటించాలని సూచించారు. మాస్కులు, భౌతికదూరం ద్వారా ప్రాథమికంగా కరోనా నుంచి కాపాడుకోవచ్చని గులేరియా అభిప్రాయపడ్డారు.

కాగా, అమెరికా వంటి దేశాల్లో రెండు డోసుల టీకా తీసుకున్న వారు మాస్కు ధరించనవసరంలేదని అక్కడి ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. దీనిపై కేంద్రం వివరణ ఇచ్చింది. వ్యాక్సిన్ పొందినవారు మాస్కులు ధరించాల్సిన పనిలేదన్న అంశాన్ని ప్రస్తుతానికి మార్గదర్శకాల్లో చేర్చబోవడంలేదని స్పష్టం చేసింది. వైరస్ ఉద్ధృతంగా వ్యాపిస్తున్న తరుణంలో మాస్కులు ధరించనవసరం లేదనడం సరైన నిర్ణయం కాదని కేంద్రం పేర్కొంది.


More Telugu News