మానవత్వంలేని కేసీఆర్ కు ప్రజల ఉసురు తప్పక తగులుతుంది: కోమటిరెడ్డి ఫైర్

  • కరోనాను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చరన్న కోమటిరెడ్డి
  • అసెంబ్లీలో కేసీఆర్ చెప్పిన మాట ఏమైందని ఆగ్రహం
  • కేటీఆర్ ను ట్విట్టర్ లో నిలదీస్తున్నారని వెల్లడి
  • కేసీఆర్ కు సీఎంగా కొనసాగే అర్హత లేదని వ్యాఖ్యలు
తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చుతామని కేసీఆర్ అసెంబ్లీలో చెప్పిన మాట ఏమైందని ప్రశ్నించారు. కరోనాను ఆరోగ్యశ్రీలో ఎప్పుడు చేర్చుతారని ప్రజలు కేటీఆర్ ను ట్విట్టర్ లో నిలదీస్తున్నారని వెల్లడించారు. కేసీఆర్, కేటీఆర్ డ్రామాలు ఆపి కరోనా బారినుంచి ప్రజలను కాపాడాలని స్పష్టం చేశారు.

ప్రజల ప్రాణాలతో ఆడుకునే అధికారం మీకెవరిచ్చారని నిలదీశారు. కరోనా బారినపడి ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే కనిపించడం లేదా అని నిప్పులు చెరిగారు. పేదలకు ఉచితంగా వైద్యం అందించలేని కేసీఆర్ కు సీఎం పదవిలో కొనసాగే అర్హత ఉందా? అని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవత్వంలేని కేసీఆర్ కు ప్రజల ఉసురు తప్పక తగులుతుందని అన్నారు. కేసీఆర్ పాలన చూసి తెలంగాణ తల్లి కన్నీరు పెడుతోందని వ్యాఖ్యానించారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చకపోతే ఈ తండ్రీకొడుకులను చరిత్ర క్షమించదని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.



More Telugu News