నారదా స్టింగ్‌ ఆపరేషన్‌ కేసులో ఇద్ద‌రు బెంగాల్ మంత్రుల‌ను అదుపులోకి తీసుకున్న సీబీఐ

  • సీబీఐ కార్యాల‌యానికి ఫిర్హాద్‌ హకీం, సుబ్రతా ముఖర్జీల‌   త‌ర‌లింపు
  • ఎమ్మెల్యే మదన్‌ మిత్రా, మాజీ మేయర్‌ సోవన్‌ ఛటర్జీలు కూడా
  • వారిని అరెస్ట్ చేసే అవ‌కాశం
ప‌శ్చిమ బెంగాల్‌లో 2014 నాటి 'నారదా' కేసులో ఆ రాష్ట్రానికి చెందిన మంత్రులు ఫిర్హాద్‌ హకీం, సుబ్రతా ముఖర్జీల‌ను కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు ఎమ్మెల్యే మదన్‌ మిత్రా, మాజీ మేయర్‌ సోవన్‌ ఛటర్జీలను సీబీఐ కార్యాలయానికి తరలించి సీబీఐ విచార‌ణ జ‌రుపుతోంది. ఆ త‌ర్వాత వారిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.  

కాగా, నారదా స్టింగ్‌ ఆపరేషన్‌ కేసులో విచార‌ణ జ‌రుపుతోన్న సీబీఐ అధికారులు ఈ రోజు ఉదయం 8 గంటలకే మంత్రి ఫిర్హాద్‌ హకీం నివాసానికి చేరుకుని దాదాపు 20 నిమిషాల పాటు ప్రశ్నించారు. అనంతరం సీబీఐ కార్యాలయానికి తరలించే క్ర‌మంలో హ‌కీం మాట్లాడుతూ.. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తనను సీబీఐ అరెస్టు చేసిందని ఆరోపించారు. తాను కోర్టుకు వెళ్తానని చెప్పారు. అవినీతి కేసులో విచారణ కోస‌మే వారిని తీసుకెళ్లినట్లు సీబీఐ పేర్కొంది.

ఈ నలుగురిపై సీబీఐ దర్యాప్తునకు ఇప్ప‌టికే గవర్నర్‌ జగదీప్‌ ధనకర్‌ అనుమతినిచ్చారు. నారదా టేపుల విడుదల సమయంలో వీరంతా మంత్రులుగా ఉన్నారు. ఢిల్లీ జర్నలిస్టు ఒక‌రు తృణమూల్‌ నేతలపై స్టింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించడం అప్పట్లో కలకలం రేపింది.  ఏడుగురు తృణమూల్‌ ఎంపీలతో పాటు నలుగురు మంత్రులు, ఒక ఎమ్మెల్యే, పోలీసు అధికారి నగదు తీసుకుంటూ కెమెరాకు చిక్క‌డం సంచ‌ల‌న‌మైంది.


More Telugu News