అంతర్జాతీయ ఫుట్​ బాల్​ ప్లేయర్​.. ఇటుకల బట్టీలో కూలీగా!

  • జార్ఖండ్ యువతికి లాక్ డౌన్ కష్టాలు
  • జాతీయ టీమ్ కు ఎంపికైన సంగీతా సోరెన్
  • ఆదుకుంటానన్న ప్రభుత్వ హామీ గాలికి
  • ప్లేయర్లను పట్టించుకోవట్లేదని ఆమె ఆరోపణ
ఆ అమ్మాయి అంతర్జాతీయ ఫుట్ బాలర్. 2018–19లో భూటాన్, థాయ్ లాండ్ లో జరిగిన అండర్ 17 పోటీల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ఇప్పుడు సీనియర్ జాతీయ జట్టుకూ పిలుపొచ్చింది. టీమ్ లో ఇక చేరడమే తరువాయి అన్న టైంలో.. మహమ్మారి లాక్ డౌన్ వచ్చిపడింది. ఆమె బతుకుపై కొట్టింది.

లాక్ డౌన్ తో కుటుంబం భారం మొత్తం ఆమెపైనే పడింది. ఆమె పేరు సంగీతా సోరెన్. 23 ఏళ్లు. జార్ఖండ్ లోని ధన్ బాద్ జిల్లా బాసమూది గ్రామం ఆమెది. ఆమె తండ్రి దూబా సోరెన్ కు కళ్లు లేవు. కూలి పనిచేసి జీవితాన్ని నెట్టుకొచ్చే అన్నకూ లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ఆ ఉపాధి పోయింది. దీంతో కాళ్లతో బంతిని తన్ని గోల్ కొట్టాల్సిన ఆమె.. చేతితో ఇటుకలు మోసే పనిచేస్తోంది.

ఆమెను అన్ని విధాలా ఆదుకుంటామని హేమంత్ సోరెన్ హామీ ఇచ్చినా.. ఆ హామీ కూడా ఇంత వరకు నెరవేరలేదు. దీంతో ఆమె తల్లితో కలిసి ధన్ బాద్ లోని ఓ ఇటుకల బట్టిలో కూలీ చేస్తోంది. ప్రభుత్వం హామీ ఇచ్చినా ఇంత వరకు నెరవేరలేదని ఆమె తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. కనీసం స్థానిక ఎమ్మెల్యే కూడా తమను ఇంత వరకు సంప్రదించింది లేదని అన్నాడు.

తన కల అయిన ఫుట్ బాల్ ను వదిలేది లేదని, అప్పటి వరకు బతుకు బండి నడవడానికి పనిచేయక తప్పదని సంగీత వాపోయింది. కూలీకి పోయే ముందు రోజూ ఉదయం సమీపంలోని పొలాల్లో ఆమె తన ఆటకు మెరుగులూ దిద్దుకుంటోంది.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేక స్థానిక ప్లేయర్లంతా పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నారని చెప్పింది. ప్రతి ప్లేయర్ కు మంచి ఆహారం, ప్రాక్టీస్ ముఖ్యమని, అలాంటి వాటిపై ప్రభుత్వానికి శ్రద్ధే లేదని చెప్పింది. అందుకే తన లాంటి వారంతా కూలీలుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

.


More Telugu News