సైక్లోన్ 'యాస్'పై సీఎం జగన్ సమీక్ష... ముఖ్యాంశాలు ఇవిగో!
- బంగాళాఖాతంలో 'యాస్' తుపాను
- సీఎంలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్
- పాల్గొన్న సీఎం జగన్
- ఆపై ఉన్నతాధికారులతో సమీక్ష
- 'యాస్' నేపథ్యంలో దిశానిర్దేశం
బంగాళాఖాతంలో ఏర్పడిన 'యాస్' తుపాను అనేక రాష్ట్రాలను కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఏపీ సీఎం జగన్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉత్తరాంధ్రపై 'యాస్' తుపాను ప్రభావం చూపుతుందన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో, తుపాను సహాయక చర్యలు, కొవిడ్ కార్యాచరణ నడుమ సమన్వయం అవసరమని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అధికారులకు పలు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
- 'యాస్' తుపానుతో కరోనా రోగులకు ఇబ్బంది కలగకుండా చూడాలి.
- తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కరోనా రోగులను తరలించాల్సిన పరిస్థితులు వస్తే తక్షణమే ఆ పనిచేయాలి.
- శ్రీకాకుళం జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలి.
- సహాయక శిబిరాల్లో సౌకర్యాల లోటు ఉండరాదు.
- ముఖ్యంగా కొవిడ్ రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి.
- సాంకేతిక సిబ్బంది సేవలు తీసుకోవాలి.
- ప్రధానంగా ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలి.
- ఆక్సిజన్ రీఫిల్లింగ్ ప్లాంట్లకు కూడా నిరంతరం విద్యుత్ అందించాలి.
- ఆసుపత్రుల్లో విద్యుత్ సరఫరాకు ఇబ్బంది కలగకుండా డీజిల్ జనరేటర్లను అందుబాటులో ఉంచాలి. ఆసుపత్రుల వద్ద విద్యుత్ సిబ్బందిని నియమించాలి.
- తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆక్సిజన్ కొరత రాకుండా తగిన చర్యలు తీసుకోవాలి.
- ఒడిశా తుపాను ప్రభావానికి గురైతే అక్కడి నుంచి వచ్చే ఆక్సిజన్ కు ప్రత్యామ్నాయాలను ముందే సిద్ధం చేసుకోవాలి. తగినంత మేర ఆక్సిజన్ నిల్వలు ఉండేలా జాగ్రత్త పడాలి.