వారి ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు: కమలహాసన్

  • తమిళనాడు ఎన్నికల్లో కమల్ పార్టీ ఘోర పరాజయం
  • పార్టీని వీడిన కీలక నేతలు
  • కమల్ సర్వాధికారం ప్రదర్శిస్తున్నారని ఆరోపణ
  • ఊపిరి ఉన్నంత వరకు రాజకీయాల్లోనే ఉంటానన్న కమల్
పార్టీని వీడుతూ ఆరోపణలు చేస్తున్న వారికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమలహాసన్ తేల్చి చెప్పారు. పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయిన వారు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వాటికి తాను స్పందించాల్సిన అవసరం లేదని కమల్ స్పష్టం చేశారు. ఒకసారి పార్టీని వీడి వెళ్లిపోయిన వారిని తిరిగి పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. ఎవరున్నా, లేకపోయినా తను ఊపిరి ఉన్నంత వరకు రాజకీయాల్లో కొనసాగుతానని అన్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో వీడియో పోస్టు చేశారు.

తమిళనాడు శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో కమల్ పార్టీ ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేకపోయింది. కోయంబత్తూరు సౌత్ నుంచి పోటీ చేసిన కమల్ చివరి వరకు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ విజయం సాధించలేకపోయారు. ఎన్నికల తర్వాత పలువురు కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. వెళ్తూవెళ్తూ కమల్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీలో కమల్ సర్వాధికారం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. దీంతో స్పందించిన కమల్.. పార్టీని వీడి వెళ్లే వారు చేసే ఆరోపణలకు స్పందించాల్సిన అవసరం లేదని తెగేసి చెప్పారు.


More Telugu News