తన బయోపిక్ తీయాలని పి.సుశీల నన్ను కోరారు: ఏఆర్ రెహ్మాన్

  • '99 సాంగ్స్' చిత్రంతో స్క్రీన్ రైటర్ గా మారిన రెహ్మాన్
  • సినిమాను చూడాలని సుశీలను కోరిన రెహ్మాన్
  • సినిమాపై ప్రశంసలు కురిపించిన పి.సుశీల
తన బయోపిక్ ను తెరకెక్కించాలంటూ ఆస్కార్ అవార్డు గ్రహీత, సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ ను లెజెండరీ సింగర్ పి.సుశీల కోరారు. వివరాల్లోకి వెళ్తే, '99 సాంగ్స్' అనే చిత్రంతో రెహ్మాన్ స్క్రీన్ రైటర్ గా మారారు. ఈ చిత్రంలో ఇహన్ భట్, ఎడిల్సీ వర్గాస్ ప్రధాన పాత్రలను పోషించగా... విశ్వేశ్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి చెందిన తెలుగు, తమిళం, హిందీ వర్షన్లు జియో సినిమా, నెట్ ఫ్లిక్స్ లలో ప్రసారమవుతున్నాయి.

ఈ చిత్రాన్ని చూసిన పి.సుశీల ప్రశంసలు కురిపించారట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో రెహ్మాన్ స్వయంగా చెప్పారు. ఇటీవలే తాను సుశీలమ్మతో మాట్లాడానని... '99 సాంగ్స్' సినిమా చూశారా? అని అడిగానని తెలిపారు. సినిమాను చూడకపోతే నెట్ ఫ్లిక్స్ లో చూడాలని చెప్పానని... ఆ సమయంలో ఆమె పక్కనే ఉన్న ఆమె సోదరుడికి ఈ సినిమా తెలుగు వర్షన్ ను ఆమెకు చూపించాలని కోరానని చెప్పారు.

సినిమా చూసిన తర్వాత సుశీలమ్మ తనను పిలిపించుకున్నారని... చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారని తెలిపారు. ఈ సందర్భంగా '99 సాంగ్స్' మాదిరి తన బయోపిక్ కూడా తీయాలని ఆమె తనను కోరారని చెప్పారు. మరి సుశీలమ్మ కోరికను రెహ్మాన్ ఎప్పుడు నెరవేరుస్తారో వేచి చూడాలి.


More Telugu News