ఘంటసాల సంగీత సహచరుడు సంగీతరావు కన్నుమూత

  • కరోనాతో సంగీతరావు మృతి 
  • సంగీత విద్వాంసుడిగా ఎనలేని గుర్తింపు  
  • ఘంటసాల స్వరరచనలో సహకారం
  • 'కలైమామణి' సహా పలు అవార్డులు కైవసం
ప్రముఖ సంగీత విద్వాంసుడు పట్రాయని సంగీతరావు కరోనాతో కన్నుమూశారు. ఆయన వయసు 101 సంవత్సరాలు. ఇటీవలి వరకు ఆరోగ్యంగానే ఉన్న సంగీతరావు కరోనా సోకడంతో కోలుకోలేకపోయారు. చెన్నైలోని తన నివాసంలో ఆయన నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. పట్రాయని సంగీతరావు... గాయక దిగ్గజం ఘంటసాల సంగీత సహచరుడిగా గుర్తింపు పొందారు. ఘంటసాల సంగీత కార్యకలాపాల్లో ఆయన తోడుగా ఉన్నారు. విజయనగరం మ్యూజిక్ కాలేజీలో 1938లో ఏర్పడిన వీరి స్నేహం ఘంటసాల చివరి క్షణాల వరకు కొనసాగింది.

ఇంకా చెప్పాలంటే, ఘంటసాల సంగీత గురువు పట్రాయని సీతారామశాస్త్రి కుమారుడే సంగీతరావు. వాస్తవానికి సంగీతరావు అన్నది ఆయన అసలు పేరు కాదు. సంగీత విద్వాంసుల కుటుంబంలో పుట్టిన తన బిడ్డ ఎప్పటికైనా గొప్ప సంగీతకారుడు అవుతాడని ఆయన తల్లి సంగీతరావు అని పిలుచుకునేది. కాలక్రమంలో అదే స్థిరపడిపోయింది. ఆయన అసలు పేరు పట్రాయని వేంకట నరసింహమూర్తి.

నటి కాంచన తదితరులకు సంగీతం నేర్పించిన పట్రాయని సంగీతరావు... 'పరోపకారి' చిత్రంలో ఓ పాటను కూడా పాడారు. ఘంటసాల స్వర ప్రస్థానంలో సహాయకుడిగా వ్యవహరించారు. ఘంటసాల నుంచి వచ్చిన 'భగవద్గీత' ఆడియో స్వరరచనలో సంగీతరావు పాత్ర కీలకం. అంతేకాదు, ప్రముఖ కూచిపూడి నృత్య దిగ్గజం వెంపటి చినసత్యంతోనూ ఆయనకు అనుబంధం ఉంది. పలు కూచిపూడి సంగీత నృత్యరూపకాలకు సంగీతరావు సంగీత సహకారం అందించారు.

ఆయనకు తమిళనాడు ప్రభుత్వం 'కలైమామణి' అవార్డు ప్రదానం చేయగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'ఘంటసాల' అవార్డుతో గౌరవించింది. ఆయన ఖాతాలో సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా ఉంది.


More Telugu News