ప్రపంచవ్యాప్తంగా కాసేపు స్తంభించిన ఇంటర్నెట్‌!

  • నిలిచిపోయిన ప్రముఖ సంస్థ వెబ్‌సైట్లు
  • గరిష్ఠంగా గంటపాటు సేవల్లో అంతరాయం
  • క్లౌడ్‌ సేవల కంపెనీ ‘ఫాస్ట్లీ’ సేవల్లో లోపమే కారణం
  • తక్కువ రద్దీ ఉన్న మార్గాల ద్వారా కంటెంట్‌ను తరలించడమే ఫాస్ట్లీ పని
  • వ్యాక్సినేషన్‌ నమోదుపైనా ప్రభావం
ప్రపంచవ్యాప్తంగా పలు సామాజిక మాధ్యమాలు, మీడియా, ప్రభుత్వ వెబ్‌సైట్లు కాసేపు స్తంభించిపోయాయి. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న క్లౌడ్‌ సేవల కంపెనీ ‘ఫాస్ట్లీ’ సేవల్లో అంతరాయం తలెత్తడంతో ఇంటర్నెట్‌లో సమస్యలు వెలుగుచూశాయి. ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండే రెడిట్‌, అమెజాన్‌, సీఎన్‌ఎన్‌, పేపాల్‌, స్పోటీఫై, అల్‌ జజీరా మీడియా నెట్‌వర్క్‌, న్యూయార్క్‌ టైమ్స్‌ వంటి ప్రముఖ సంస్థల వెబ్‌సైట్లన్నీ నిలిచిపోయాయి. కొన్ని సైట్లలో గరిష్ఠంగా గంట వరకు సమస్యలు తలెత్తాయి. సమస్యను పరిష్కరించడంతో ప్రస్తుతం సేవలు యథాతథంగా కొనసాగుతున్నాయి.

క్లౌడ్‌ ఆధారిత కంటెంట్‌ డెలివరీ నెట్‌వర్క్‌ ప్రొవైడర్‌ అయిన ఫాస్ట్లీ దీనిపై స్పందించింది. సమస్యను వెంటనే గుర్తించి సరిచేసినట్లు వెల్లడించింది. తక్కువ రద్దీ ఉన్న మార్గాల ద్వారా వెబ్‌సైట్‌లకు కంటెంట్‌ను తరలించి తద్వారా వినియోగదారులకు వేగంగా చేర్చడమే దీని పని. 2019లో ఐపీఓకి వచ్చిన ఈ సంస్థ మార్కెట్‌ విలువ 5 బిలియన్‌ డాలర్లు. అమెజాన్‌ వెబ్‌ సర్వీస్‌ వంటి ప్రత్యర్థి సంస్థలతో పోలిస్తే ఫాస్ట్లీ చాలా చిన్నది. అయినప్పటికీ పలు కీలక సంస్థలకు సేవలందిస్తోంది.

ఇక ఇంటర్నెట్‌ స్తంభించిన సమయంలో పలు సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సేవల్ని కొనసాగించాయి. అనేక దేశాల్లో వ్యాక్సినేషన్‌ నమోదుపై సైతం దీని ప్రభావం పడింది.


More Telugu News