అశోక్ గజపతిరాజు కాలిగోటికి కూడా విజయసాయిరెడ్డి సరిపోరు: టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు

  • అశోక్ రాజు గురించి మాట్లాడే అర్హత కూడా విజయసాయికి లేదు
  • మహారాజు అయినా దర్పం ప్రదర్శించని వ్యక్తి అశోక్ రాజు
  • పంచగ్రామాలపై కేసులు ఎవరు వేశారో విజయసాయి చెప్పాలి
అశోక్ గజపతిరాజుపై విమర్శలు చేస్తున్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు. అశోక్ గజపతిరాజు కాలి గోటికి కూడా విజయసాయిరెడ్డి సరిపోరని ఎద్దేవా చేశారు. ఆయన గురించి మాట్లాడే నైతిక అర్హత కూడా విజయసాయికి లేదని అన్నారు. మహారాజు అయినా ఎలాంటి దర్పాన్ని ప్రదర్శించని వ్యక్తిపై విమర్శలు చేస్తారా? అని మండిపడ్డారు.

ఆశోక్ రాజు గారు భూములు తీసుకున్నారని మీకు ఎవరైనా ఫిర్యాదు చేశారా? అని పల్లా ప్రశ్నించారు. విజయసాయి ఇప్పటికే ఎన్నో తప్పులు చేశారని విమర్శించారు. పంచగ్రామాలపై ఎవరు కేసులు వేశారో విజయసాయి చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు మాన్సాస్ ట్రస్టు, సింహాచలం భూములతో విజయసాయికి ఏం సంబంధం అని ప్రశ్నించారు. విజయసాయి ఇలాగే మాట్లాడితే ఉత్తరాంధ్ర ప్రజలు సహించరని అన్నారు. సింహాచలం అప్పన్న దర్శనానికి వచ్చిన అశోక్ రాజు పట్ల ఆలయ అధికారులు వ్యవహరించిన తీరు దారుణమని వ్యాఖ్యానించారు. రాజకీయాలతో అధికారులకు ఏం సంబంధమని ప్రశ్నించారు. అధికారులు తీరు మార్చుకోవాలని సూచించారు.


More Telugu News