రిలీజ్ కి ఉత్సాహంగా ఉన్న 'లవ్ స్టోరీ'

  • శేఖర్ కమ్ముల నుంచి మరో ప్రేమకథ
  • కరోనా కారణంగా వెనక్కి వెళ్లిన విడుదల
  • ఈ నెలలో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందంటూ టాక్
  • జనంలోకి దూసుకుపోయిన 'సారంగ ధరియా'
తెలుగులో ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ గా శేఖర్ కమ్ముల కనిపిస్తాడు. ఆయన సినిమాల్లో ప్రేమ .. కుటుంబ బంధాలు పెనవేసుకుపోయి కనిపిస్తాయి. సున్నితమైన హావభావాల ఆవిష్కరణ కనిపిస్తుంది. అలాంటి శేఖర్ కమ్ముల ఈ సారి 'లవ్ స్టోరీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నాగచైతన్య - సాయిపల్లవి కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమాను, ఏప్రిల్లోనే విడుదల చేయాలనుకున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా జరిగిపోయాయి. కానీ కరోనా తీవ్రత పెరగడం వలన, థియేటర్లకు రాకుండా ఉండిపోయింది.

ఇక ఇప్పుడు పరిస్థితి కొంతవరకు అనుకూలంగా మారుతోంది. తెలంగాణ .. ఆంధ్ర రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో థియేటర్లు ఓపెన్ అయిన తరువాత ఈ సినిమాను విడుదల చేయాలనే బలమైన ఒక టాక్ వినిపిస్తోంది. ఈ నెల 30వ తేదీన ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయనే అంటున్నారు. అందులో వాస్తవమెంతన్నది, అధికారిక ప్రకటన వస్తేనే గాని తెలియదు మరి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన 'సారంగ ధరియా' సాంగ్ యూత్ ను ఒక ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే.


More Telugu News