మహిళా సైనికుల సౌకర్యం కోసం 'హైహీల్స్' కు మార్పులు చేయనున్న ఉక్రెయిన్

  • ఇటీవల మహిళా సైనికులకు హైహీల్స్
  • సర్వత్రా విమర్శలు, ఆందోళనలు వ్యక్తం
  • హైహీల్స్ కు మార్పులు చేశామన్న ఉక్రెయిన్
  • రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన
ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ మహిళా సైనికులకు బూట్ల స్థానంలో హైహీల్స్ అందించనున్నట్టు ఇటీవల ప్రకటించగా, తీవ్ర విమర్శలు వచ్చాయి. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అనంతరం ఉక్రెయిన్ స్వతంత్ర దేశంగా ఎదిగింది. ఆగస్టు 24న 30వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్వహించే పరేడ్ లో మహిళా సైనికులు హైహీల్స్ తో కనువిందు చేయనున్నారు. అయితే, ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. హైహీల్స్ ఇవ్వడం వల్ల మహిళా సైనికుల ఆరోగ్యం దెబ్బతింటుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో, ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ మరో ప్రకటన చేసింది. మహిళా సైనికులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా ప్రత్యేకంగా రూపొందించిన హైహీల్స్ అందిస్తామని తెలిపింది. హైహీల్స్ నిర్ణయాన్ని మాత్రం ఉపసంహరించుకోవడంలేదని, వాటిని మహిళా సైనికులకు అనుగుణంగా రూపొందిస్తున్నామని ఉక్రెయిన్ రక్షణ మంత్రి ఆంద్రీయ్ తరాన్ వెల్లడించారు.


More Telugu News