అష్రఫ్ ఘనీ దేశద్రోహి, శిక్షించండి... భారత్ లోని ఆఫ్ఘన్ ఎంబసీ నుంచి అనుచిత ట్వీట్!

  • అనుచరులతో కలిసి దేశాన్ని విడిచి పారిపోయారు
  • ఘనీని దేవుడు శిక్షిస్తాడంటూ ట్వీట్లు
  • ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారన్న ఆఫ్ఘన్ ఎంబసీ మీడియా కార్యదర్శి
రెండు దశాబ్దాలుగా అమెరిగా బలగాల అండతో ఆఫ్ఘనిస్థాన్ లో కొనసాగిన ప్రజాస్వామ్య ప్రభుత్వ పాలన ఎట్టకేలకు ముగిసింది. ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ ని కూడా తాలిబన్లు ఆక్రమించుకోవడంతో యావత్ దేశం ముష్కరుల గుప్పిట్లోకి వచ్చింది. ఇదే సమయంలో దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇదే సమయంలో తమ సొంత ప్రభుత్వాన్ని నెలకొల్పేందుకు తాలిబన్లు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

మరోవైపు ఆఫ్ఘన్ లో ఈ పరిణామాలన్నీ జరుగుతున్న సమయంలోనే ఇండియాలోని ఆఫ్ఘన్ ఎంబసీ అధికార ట్విట్టర్ ఖాతా నుంచి ఓ అనుచిత ట్వీట్ వచ్చింది. ట్వీట్ లో అష్రఫ్ ఘనీని ఉద్దేశించి దుండగులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అష్రఫ్ ఘనీ దేశద్రోహి అని... ఆయనను చూసి తాము సిగ్గుతో తలదించుకుంటున్నామని ట్వీట్ లో పేర్కొన్నారు.

ఘనీ బాబా (అష్రఫ్) తన అనుచరులతో కలసి దేశాన్ని విడిచి పారిపోయారని... అలాంటి వ్యక్తికి ఇన్నాళ్లు సేవ చేసినందుకు తమను క్షమించాలని ట్వీట్ చేశారు. ఆ దేశద్రోహిని దేవుడు కచ్చితంగా శిక్షిస్తాడని అన్నారు. ఘనీ పాలన ఆఫ్ఘన్ పాలనలో ఒక మరక అని కామెంట్ చేశారు.

అయితే, ఈ ట్వీట్ కొద్దిసేపటికే డిలీట్ అయింది. అనంతరం ఆఫ్ఘన్ ఎంబసీ మీడియా కార్యదర్శి అబ్దుల్ అజాద్ మాట్లాడుతూ, తమ ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారని చెప్పారు. ఎంబసీ ట్విట్టర్ ఖాతాకు తాను యాక్సెస్ కోల్పోయానని... అయితే ఒక స్నేహితుడు ఈ ట్వీట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ ను తనకు పంపించారని... తాను లాగిన్ కావడానికి ప్రయత్నించినా కుదరలేదని తెలిపారు.


More Telugu News