వరంగల్ సభకు రాహుల్‌గాంధీ.. అధికారంలోకి రాకుండా ఎవరూ అడ్డుకోలేరన్న రేవంత్

  • రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా 72 స్థానాలు
  • సమన్వయకర్తలు అద్భుతంగా పనిచేస్తున్నారు: మాణికం ఠాగూర్
  • హుజూరాబాద్‌లో పోటీకి కొండా సురేఖ ముందుకు రావడం శుభపరిణామం: జగ్గారెడ్డి
  • ఈ నెల 24న మేడ్చల్‌లో 48 గంటల దీక్ష: మహేశ్వర్‌రెడ్డి
వరంగల్‌లో వచ్చే నెలలో నిర్వహించనున్న దండోరా సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరవుతారని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇందిరాభవన్‌లో నిన్న జరిగిన ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’ నియోజకవర్గ సమన్వయకర్తల సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంద్రవెల్లి, రావిర్యాల సభలను విజయవంతం చేశారంటూ వారిని ప్రశంసించారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌కు 72 సీట్లు వస్తాయని, కాంగ్రెస్‌ను అధికారంలోకి రాకుండా ఎవరూ అడ్డుకోలేరని అన్నారు.

కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణికం ఠాగూర్ మాట్లాడుతూ.. సమన్వయకర్తలు అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. అవినీతి అంశాలపై నియోజకవర్గాల వారీగా నివేదికలు తయారు చేసి సీబీఐ, న్యాయపరమైన విచారణల కోసం పోరాడాలని సూచించారు. కేసీఆర్, మోదీ హామీలు, అవినీతి అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

దళితబంధు పథకాన్ని రాష్ట్రమంతటా అమలు చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేయగా, హుజూరాబాద్‌లో పోటీకి కొండా సురేఖ ముందుకు రావడం శుభపరిణామమని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కాగా, ఈ నెల 24న ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మేడ్చల్ లో 48 గంటల దీక్ష చేయాలని నిర్ణయించినట్టు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ రాష్ట్ర చైర్మన్ మహేశ్వర్‌రెడ్డి తెలిపారు.


More Telugu News